బౌలర్లకు అనుకూలించే లక్నో పిచ్‌పై కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ శివాలెత్తడంతో చెన్నై నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యం చిన్నబోయింది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) బ్యాటర్లు క్రీజులో నిలవడానికే తంటాలుపడ్డ పిచ్‌పై ఈ ఇద్దరూ రికార్డు స్థాయిలో తొలి వికెట్‌కు 134 పరుగులు జోడించి లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)కు ఈ సీజన్లో నాలుగో విజయాన్ని అందించారు. మొదట చెన్నై టాపార్డర్ పనిపట్టి ఆ జట్టును నిలువరించిన లక్నో ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ రెచ్చిపోయి రికార్డు ఛేదనను మరో ఓవర్ ఉండగానే ఛేదించింది. చెన్నైని బ్యాటింగ్‌లో జడేజా, రహానే ఆదుకోగా ఆఖర్లో ధోనీ మెరుపులతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
IPL | లక్నో: వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓటమి తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ మళ్లీ విజయాల బాట పట్టింది. బౌలర్లకు అనుకూలంగా ఉంటూ బ్యాటర్లకు కొరకరాని కొయ్యగా మారిన లక్నో పిచ్‌పై రికార్డు ఛేదనను విజయవంతంగా పూర్తి చేసింది. చెన్నై నిర్దేశించిన 177 పరుగులు ఛేదనను మరో ఓవర్ మిగిలుండగానే 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. నిర్జీవమైన లక్నో పిచ్‌పై డికాక్ (43 బంతుల్లో 54, 5 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ (53 బంతుల్లో 82, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) రికార్డు భాగస్వామ్యంతో ఆ జట్టు 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తిచేసింది. తొలుత సీఎస్కేను లక్నో బౌలర్లు కట్టడి చేయడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (40 బంతుల్లో 57 నాటౌట్, 5 ఫోర్లు, 1 సిక్సర్), రహానే (36)రాణించారు. రాహుల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఆరంభ మ్యాచ్‌లలో అదరగొట్టిన రచిన్ (0) మరోసారి నిరాశపరచగా కెప్టెన్ రుతురాజ్ (17) విఫలమయ్యాడు. నాలుగో స్థానంలో వచ్చిన జడేజా.. ఓపెనర్ రహానే (36) తో కలిసి వికెట్లను కాపాడుకుంటూనే రన్‌రేట్ పడిపోకుండా పరుగులు రాబట్టారు. మూడో వికెట్‌కు 35 పరుగులు జోడించిన ఈ జోడీని కృనాల్ విడదీశాడు. అతడు వేసిన 9వ ఓవర్లో రహానే క్లీన్‌బౌల్డ్ అవగా ఈ సీజన్లో జోరుమీదున్న దూబే (3)ను స్టోయినిస్ పెవిలియన్‌కు పంపాడు. రహానే స్థానంలో వచ్చిన రిజ్వి (1) ప్రభావం చూపకుండానే చేతులెత్తేయడంతో చెన్నై కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జడ్డూ.. మోయిన్ అలీ (30) సీఎస్కే బండిని లాగించాడు. 36 బంతుల్లోనే జడ్డూ అర్ధ సెంచరీ పూర్తయింది. 18వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టిన అలీ.. చెన్నై ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ మరుసటి బంతికే అతడు బదోని చేతికి చిక్కాడు. 13 బంతులు మిగిలుండగా క్రీజులోకి వచ్చిన ధోనీ.. 4, 6, 6, 4, 4 తో చెన్నైకి పోరాడే స్కోరును అందించాడు.
లక్ష్య ఛేదనలో లక్నోకు ఓపెనర్లు తిరుగులేని ఆరంభాన్నిచ్చారు. పవర్ ప్లేలో ఈ జోడీ చెన్నై బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించి 54 పరుగులు చేసింది. 9వ ఓవర్లో డికాక్ ఇచ్చిన క్యాచ్‌ను షార్ట్ థర్డ్‌మెన్ వద్ద పతిరాన జారవిడవడంతో అతడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. జడ్డూనే వేసిన 11వ ఓవర్లో బౌండరీతో 31 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. ముస్తాఫిజుర్ 15వ ఓవర్లో డికాక్ ధోనీకి క్యాచ్ ఇవ్వడంతో 134 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఈ పిచ్‌పై ఏ వికెట్‌కు అయినా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. రాహుల్, డికాక్ ఔట్ అయినా పూరన్ (23 నాటౌట్), స్టోయినిస్ (8 నాటౌట్)గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశారు.
చెన్నై : 20 ఓవర్లలో 176/6 (జడేజా 57 నాటౌట్, రహానే 36, స్టోయినిస్ 1/7, కృనాల్ 2/16).
లక్నో : 19 ఓవర్లలో 180/2 (రాహుల్ 82, డికాక్ 54, పతిరాన 1/29, ముస్తాఫిజుర్ 1/43)