భువనేశ్వర్: జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో టైటిల్ ఆశలు గల్లంతు చేసుకున్న యువ భారత్ కాంస్య పతకాన్ని కూడా చేజార్చుకుంది. భువనేశ్వర్ వేదికగా ఆదివారం మూడో స్థానం కోసం జరిగిన పోరులో భారత్ 1-3తో ఫ్రాన్స్ చేతిలో ఓటమి పాలైంది. ప్రత్యర్థి జట్టు సారథి టిమోథి క్లెమెంట్ (26వ, 34వ, 47వ ని.ల్లో) హ్యాట్రిక్ గోల్స్‌తో విజృంభించగా.. భారత్ తరఫున సుదీప్ చిర్మాకో (42వ ని.లో) ఏకైక గోల్ సాధించాడు. లీగ్ దశలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్ చేతిలో ఖంగుతిన్న యువ భారత్‌కు.. కాంస్య పతక పోరులోనూ పరాజయమే పలకరించింది.
ఆదివారమే జరిగిన తుదిపోరులో అర్జెంటీనా 4-2తో జర్మనీపై నెగ్గి టైటిల్ ఎగరేసుకుపోయింది. సొంతగడ్డపై డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్.. కనీసం కాంస్య పతకమైనా చేజిక్కించుకుంటుందనుకుంటే.. ప్లే ఆఫ్ పోరులో మన కుర్రాళ్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. తొలి క్వార్టర్లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడగా.. రెండో క్వార్టర్లో ఫ్రాన్స్‌కు ఆధిక్యం లభించింది. 26వ నిమిషంలో ఆ జట్టు ఖాతా తెరిచిన కెప్టెన్ క్లెమెంట్.. మూడో క్వార్టర్లో మరో గోల్‌తో ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. దీంతో ఒత్తిడిలో పడ్డ భారత్ దూకుడు కనబర్చి 42వ నిమిషంలో సుదీప్ గోల్‌తో ఆధిక్యాన్ని తగ్గించినా.. ఫలితాన్ని మాత్రం మార్చలేకపోయింది. ఈ క్రమంలో క్లెమెంట్ హ్యాట్రిక్ గోల్ నమోదు చేయడంతో భారత్ ఇక కోలుకోలేకపోయింది