మేడ్చల్, డిసెంబర్ 30: మృత్యురూపంలో లారీ దూసుకొచ్చింది.. కొత్త సంవత్సరాన్ని ఊర్లో జరుపుకొందామని సంతోషంగా బయలుదేరిన ఆ దంపతులను ఢీకొట్టింది. ఈ విషాద ఘటనలో భార్య మృతిచెందగా, భర్త, కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. మేడ్చల్ పోలీసుల కథనం ప్రకారం..
మెదక్ జిల్లా, రామాయంపేట మండలం, కలకుంట్ల గ్రామానికి చెందిన బురాని స్వామి(26), సోనీ(23) దంపతులు దూలపల్లిలో నివాసముంటున్నారు. నూతన సంవత్సర వేడుకలను సొంతూరులో చేసుకుందామని గురువారం దంపతుల్దిద్దరు కొడుకు ప్రణయ్(3)ను తీసుకొని.. బైక్‌పై బయలుదేరారు. అత్వెల్లి గ్రామం వద్ద 44వ జాతీయ రహదారిపై వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో సోనీ అక్కడికక్కడే చనిపోగా, భర్త, కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. వారు మేడ్చల్‌లోని లీలా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ అప్పారావు తెలిపారు.
మానవత్వాన్ని చాటుకున్న విలేకరి..
ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న ఓ పత్రిక విలేకరి శివ మానవత్వాన్ని చాటుకున్నారు. ఘటనాస్థలిలో తల్లి చనిపోగా, తండ్రి కాలు విరిగి అచేతన స్థితిలో ఉండగా, వారి కొడుకు ప్రణయ్‌ని ఆటోలో వైద్యశాలకు తీసుకెళ్లి.. బంధువులు వచ్చేవరకు ఉండి..చికిత్స చేయించారు.