గత కొంతకాలంగా బాలీవుడ్ చిత్రసీమలోకి ఔత్సాహిక ప్రతిభావంతులు రావడం కష్టంగా మారిందని చెప్పారు సీనియర్ నటుడు వివేక్ ఒబెరాయ్. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో అవకాశాల పరంగా లాబీయింగ్ నడుస్తున్నదని..ప్రతిభ కంటే సిఫారసులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఆయన నటిస్తున్న ‘ఇన్సైడ్ ఎడ్జ్’ సిరీస్ మూడో భాగం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా సమకాలీన బాలీవుడ్ తీరుతెన్నులపై పదునైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ‘ఇరవైఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నా. ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి నిలదొక్కుకున్నా. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే వారికి పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఇంటిపేరును చూసో లేదా లాబీయింగ్ బృందాల మద్దతు ఉంటేనో అవకాశాలు దక్కుతున్నాయి. బలమైన నేపథ్యం లేకుండా ఛాన్స్ దొరకడం చాలా కష్టం. అయితే నా వరకు మాత్రం కొత్త వారిని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నా. నా సరసన జూనియర్స్ నటిస్తున్నా వారి పేరునే సినిమాలో ముందుగా ప్రస్తావించమని చెబుతున్నా’ అని చెప్పారు.