వాషింగ్టన్: అణ్వాయుధాలతో యుద్ధం పెద్ద ఎత్తున జరిగితే, పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో మాత్రమే కాకుండా, ఇతర ప్రాంతాల్లో కూడా ఆహారోత్పత్తి, ఆహార సరఫరాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. ‘న్యూక్లియర్ వింటర్’ను కృత్రిమంగా సృష్టించి ఈ పరిశోధనను నిర్వహించారు. మసి, దుమ్ము వాతావరణంలోకి ప్రవేశించడం వల్ల భూమిపైకి వచ్చే సూర్యరశ్మి తగ్గిపోతుందని, ఫలితంగా అనేక సంవత్సరాలపాటు పంటలు పండవని ఈ పరిశోధనలో వెల్లడైంది. అణ్వాయుధ యుద్ధం పర్యవసానాలు ప్రపంచ ఆహార ఉత్పత్తిపై సుదీర్ఘ కాలం, తీవ్రంగా ఉంటాయని దీని ద్వారా తెలిసింది.
ప్లాంట్ సైంటిస్ట్, మెటీరియాలజిస్ట్ యునింగ్ షి మాట్లాడుతూ, ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తుల సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి తమ అధ్యయనం ఉపయోగపడిందన్నారు. విపత్కర వాతావరణ పరిస్థితుల్లో ఏ విధంగా స్పందించాలో తెలిసిందని చెప్పారు. అణ్వాయుధాల పేలుడు తర్వాత వ్యవసాయాన్ని యూవీబీ రేడియేషన్ ఏ మేరకు ధ్వంసం చేయగలదో అంచనా వేసిన మొదటి అధ్యయనం తమదేనని తెలిపారు. అణ్వాయుధాల పేలుడు వల్ల 6-8 ఏండ్లపాటు పంట నష్టం జరుగుతుందన్నారు.

సూర్యుడి నుంచి వచ్చే యూవీ రేడియేషన్‌ను ఓజోన్ పొర శోషించుకుంటుందని, అణ్వాయుధాల పేలుడు వల్ల ఓజోన్‌కు ఉన్న ఆ సామర్థ్యం దెబ్బ తింటుందని చెప్పారు. అణ్వాయుధాల పేలుడు వల్ల, వెలువడే మంటల వల్ల స్ట్రాటోస్ఫియర్‌లోకి నైట్రోజన్ ఆక్సైడ్స్ విడుదల అవుతాయని తెలిపారు. నైట్రోజన్ ఆక్సైడ్స్, మసి వల్ల వచ్చే ఉష్ణం ఓజోన్ను వేగంగా ధ్వంసం చేస్తుందని.. దీనివల్ల మొక్కల కణజాలం దెబ్బ తింటుందని, ప్రపంచ ఆహార ఉత్పత్తి తగ్గిపోతుందని వివరించారు.