గత వారం మార్కెట్ కరెక్షన్ ఊహించిన రీతిలోనే జరిగింది. ప్రధాన సూచీ నిఫ్టీ 413 పాయింట్లు లేదా 2.48 శాతం మేర కరెక్షన్కు గురైంది. సెన్సెక్స్ కూడా 2.7 శాతం నష్టపోయింది. మెటల్ ఇండెక్స్ 7 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 3.8 శాతం చొప్పున లాభపడ్డాయి. ఆటో రంగ ఇండెక్స్ గరిష్ఠంగా 9 శాతం మేర నష్టపోయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 5.5 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 5.6 శాతం చొప్పున పతనమయ్యాయి.
టెక్నికల్‌గా నిఫ్టీ డిసెంబర్ 20 నాటి కనీస స్థాయికి దిగువన ముగియడం ద్వారా డబుల్ టాప్ ప్యాట్రన్ బ్రేక్‌డౌన్ జరిగింది. దీర్ఘకాల బేరిష్ ట్రెండ్ సంకేతమిది. స్వల్ప, దీర్ఘకాల చలన సగటులకు దిగువకు పతనం కావడం ద్వారా అంతకుముందు వారమే బేరిష్ సంకేతాలను ఇచ్చిన నిఫ్టీ.. గత వారం పతనంతో ధృవీకరించింది. వీక్లీ చార్ట్‌లలో ఆర్ఎస్ఐ ఇండికేటర్ 40 స్థాయిలకు పతనం కావడం, ఎంఏసీడీ ఇండికేట్ జీరో లైన్‌కు దగ్గరగా రావడం వంటి పరిణామాలు మార్కెట్‌కు శుభసూచకం కాదు. అయితే డౌన్వార్డ్ చానెల్ మద్దతు రేఖ దగ్గర నిఫ్టీ ముగియడం ఒక్కటే కాస్త ఆశలు రేపుతున్నది. కానీ మద్దతు స్థాయి దగ్గర ముగిసినా.. షూటింగ్ స్టార్ లాంటి క్యాండిల్ ఏర్పాటు చేయడం వల్ల మద్దతు స్థాయి నుంచి మార్కెట్ కోలు కుంటుందన్న ఆశలకు గండిపడింది. అనేక ప్రధాన షేర్లు బేస్ ఫార్మేషన్ల దిగువన ముగియడం ద్వారా బ్రేక్డౌన్లకు గురయ్యాయి. కీలక మద్దతు స్థాయిలకు దిగువన ముగియడంతోపాటు అనేక షేర్లు 52 వారాల కనీస స్థాయిలో ముగిశాయి. ఒకప్పటి మార్కెట్ లీడర్స్ హెచ్డీఎఫ్సీ, హెడ్ఎఫ్సీ బ్యాంక్ షేర్లు చాలా బలహీనంగా ముగిశాయి.
గత నెల అత్యధికంగా రూ.45,720.07 కోట్ల షేర్లను అమ్మిన విదేశీ సంస్థాగత మదుపరులు.. ఈ నెల మొదటి మూడు రోజుల్లోనే రూ.18,614.61 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ అమ్మకాలకు ధీటుగా దేశీయ ఆర్థిక సంస్థలు కొనుగోళ్లు జరపలేకపోతున్నాయి. దీంతో కనీస స్థాయిల్లో కొనుగోళ్ళ మద్దతు లభించడం లేదు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు కొత్తగా కొనుగోళ్లు జరపడానికి ఏమాత్రం అనువుగా లేవు. ప్రస్తుతం క్యాపిటల్‌ను సురక్షితంగా ఉంచడంపైనే ఇన్వెస్టర్లు దృష్టిని సారించాలి. నిఫ్టీ మళ్లీ 16,657 స్థాయిని అధిగమించనంత కాలం బేరిష్ దృష్టితోనే మార్కెట్‌ను చూడాలి. అలాగే ఒకవేళ నిఫ్టీ16,156 స్థాయికి దిగువన ముగిస్తే తదుపరి మద్దతు స్థాయి 15,550 స్థాయిలో ఉంది.
ఈ వారం మెటల్, ప్రభుత్వ రంగ సంస్థల షేర్లు వెలుగులో ఉండవచ్చు. హిందాల్కో, వేదాంత, ఒఎన్జీసీ షేర్లలో పాజిటివ్ ట్రెండ్ కనిపించవచ్చు.