సూపర్‌హీరో కథాంశంతో రూపొందిన ‘లోక ఛాప్టర్-1’ (తెలుగులో ‘కొత్తలోక’) చిత్రంతో కెరీర్లోనే బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది కథానాయిక కల్యాణి ప్రియదర్శన్. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా 300కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. గత ఏడాది మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ‘లోక ఛాప్టర్-1’ అపూర్వ విజయంతో కల్యాణి ప్రియదర్శన్ పేరు జాతీయ స్థాయిలో మార్మోగిపోయింది. బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమెతో సినిమాలు తీసేందుకు ఆసక్తిగా ఉన్నారు. తాజాగా ఈ సొగసరి బాలీవుడ్లో భారీ ఆఫర్‌ను దక్కించుకుంది.
జాంబీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం ద్వారా జై మెహతా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మరో విశేషమేమిటంటే.. బాలీవుడ్ అగ్ర హీరో రణ్‌వీర్‌సింగ్ ఈ సినిమా ద్వారా ఫిల్మ్ ప్రొడక్షన్లోకి ప్రవేశిస్తున్నారు. ‘మా కసమ్’ బ్యానర్‌పై ఆయన తెరకెక్కించనున్న తొలి సినిమా ఇది. ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్తుందని, ‘లోక ఛాప్టర్-1’లో కల్యాణి ప్రియదర్శన్ పర్ఫార్మెన్స్ రణ్‌వీర్‌సింగ్‌ను ఎంతగానో ఆకట్టుకుందని, అందుకే పలువురు బాలీవుడ్ అగ్ర నాయికల్ని కాదని కల్యాణి ప్రియదర్శన్‌కు అవకాశమిచ్చారని ముంబై సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ప్రస్తుతం కల్యాణి ప్రియదర్శన్ తమిళంలో ‘జీని’ ‘మార్షల్’ చిత్రాల్లో నటిస్తున్నది.