జనగామ: ఆదివారం హుస్నాబాద్ సభ ద్వారా అసెంబ్లీ ఎన్నికల ప్రచార శంఖం పూరించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం జనగామలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహస్తున్నారు.
సీనియర్ నాయకులు, రాజకీయంగా అపార అనుభవం ఉన్న పొన్నాల లక్ష్మయ్య గాయపడి బాధపడి ఉన్నారని, తాను పిలువగానే తనపై నమ్మకంతో పార్టీలోకి వచ్చారని చెప్పారు. ప్రజల సమక్షంలో పొన్నాలకు ధన్యవాదాలు తెలిపారు.
తమకు బీసీ బంధు రాలేదని ఎవరూ బాధపడవద్దని, ఎన్నికల కోడ్ కారణంగా రానివాళ్లకు ఆ తర్వాత కూడా బీసీ బంధు వస్తుందని చెప్పారు. అదేవిధంగా గృహలక్ష్మి పథకం కింద కూడా అందరికీ నిధులు వస్తాయని సీఎం అన్నారు.
బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రంలో కుల పంచాయితీలుగానీ, మత ఘర్షణలుగానీ లేవని సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో హిందూ ముస్లింలు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని విజ్ఞప్తి చేశారు. పల్లెల్లో హిందూముస్లింలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటారని చెప్పారు.
కొందరు తాము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో విసిరిపారేద్దాం అని చెబుతున్నారని, ధరణిని బంగాళాఖాతంలో వేయాలో, ధరణి బంగాళాఖాతంలో వేద్దామన్నోళ్లను బంగాళాఖాతంలో వేయాలో మీరే నిర్ణయించాలని ఓటర్లను కోరారు.
ప్రజలు ఆలోచించి ఓటేయాలని, మాయ మాటలు నమ్మి మన తల మనం కోసుకోవద్దని సీఎం సూచించారు. పొరపాటున వేరే పార్టీ అధికారంలోకి వస్తే జరిగిన అభివృద్ధి వెనుకబడుతుందని హెచ్చరించారు. అప్పుడు తాను కూడా ఏమీ చేయలేనన్నారు.
ధరణితో భూ క్రయవిక్రయాల్లో అక్రమాలకు తెరదించామని సీఎం కేసీఆర్ అన్నారు. అమాయక ప్రజలు మోసపోకుండా ధరణి తోడ్పడుతుందని చెప్పారు.
తొమ్మిదేళ్ల క్రితం గోసపడ్డ రాష్ట్రానికి ఇప్పుడు ముఖం తెలివి వచ్చిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఉన్నారు. హెలిక్యాప్టర్‌లో తిరుగుతుంటే ఎక్కడ చూసినా వరి పంటలే కనబడుతున్నాయని చెప్పారు. తెలంగాణలో పంటలు చూస్తుంటే నా మనసు పులకించి పోతున్నదని అన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పటికే ప్రగతి పథంలో దూసుకుపోతున్నదని, ఇక ముందు ఇంకా అభివృద్ధి జరుగుతుందని సీఎం చెప్పారు. తొమ్మిదేళ్ల కిందటి పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి చాలా మార్పు వచ్చిందన్నారు. ఇకపై మే నెలలో కూడా జిల్లాలో నీళ్లకు కరువు లేకుండా చేస్తామని చెప్పారు.
ప్రజలు ఎవరిని పడితే వాళ్లను నమ్మి ఓటు వేయవద్దని సీఎం అన్నారు. కొన్ని పార్టీల నేతలు ఎన్నికలప్పుడే ఓట్ల కోసం వచ్చి మాయ మాటలు చెబుతారని వాళ్ల మాటలు నమ్మవద్దని చెప్పారు. ఇలాంటి ఆపద మొక్కులోళ్లను నమ్మితే మోసపోతామని హెచ్చరించారు.
జనగామ ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉండేది. బచ్చన్నపేట చెరువు ఎండిపోయి నీళ్లు లేక పంటలు పండలే. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జనగామలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా వడ్లు పండుతున్నాయి.
పల్లా రాజేశ్వర్ రెడ్డి మామూలు వ్యక్తి కాదని, ఎమ్మెల్యే కాకముందే జనగామ నియోజకవర్గ సమస్యలు తెలుసుకుని మీ అందరి సమక్షంలో నాముందు పలు డిమాండ్లు పెట్టాడని అన్నారు. అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని అన్నారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సహకారంతో చిన్న కోడూరు రిజర్వాయర్‌ను బాగు చేయిస్తానని పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు.
సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యగారు కాంగ్రెస్ పార్టీలో అవమానాలు భరించలేక బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారని పార్టీ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ప్రాజెక్టులు నిర్మించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది. పాడి పరిశ్రమను కూడా ముఖ్యమంత్రి ఎంతో అభివృద్ధి చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో రైతుల జీవితాలు బాగుపడ్డాయి. కాబట్టి కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలి.
నేను 45 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉండి అవమానానికి, అవహేళనకు గురయ్యాను. అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే సీఎం కేసీఆర్ సమగ్ర సర్వే ద్వారా కుల గణన చేయించారు. కానీ ఇతర రాజకీయ పార్టీలు ఎన్నికల్లో లబ్ధి కోసం కుల గణనపై మాట్లాడుతున్నారు.
సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే జనగామకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ తీర్థం స్వీకరించారు.