న్యూఢిల్లీ: ఓ వ్యక్తి మలాశయంలో మొదటి ప్రపంచ యుద్ధం నాటి 8 అంగుళాల షెల్ను చూసి ఫ్రెంచ్ డాక్టర్లు హడలిపోయారు. భయాందోళనతో వెంటనే దవాఖానను ఖాళీ చేయించి బాంబు నిర్వీర్య నిపుణులను రప్పించారు. లైవ్ ఆర్టిలరీ షెల్ను నిర్వీర్యం చేసే సమయంలో పేలుడు సంభవిస్తే ముందు జాగ్రత్త కోసం అగ్నిమాపక సిబ్బందిని కూడా పిలిపించారు. ఏ క్యాటగిరీ పేలుడు పదార్థాన్ని తన శరీరంలో ఉంచుకున్నందుకు ఆ వ్యక్తిపై చట్ట పరమైన చర్యకు పోలీసులు సిద్ధమయ్యారు.
జనవరి 31న రాత్రి తౌలౌస్లోని రంగ్వీల్ యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ యూనిట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. తనకు అసౌకర్యంగా ఉందంటూ ఓ 24 ఏండ్ల వ్యక్తి దవాఖానకు ఆదుర్దాగా వచ్చాడు. డాక్టర్లు పరీక్షంచగా అతని మలాశయంలో ఓ పొడవైన ఇనుప పదార్థాన్ని చూసి షాకయ్యారు. వెంటనే ఎమర్జెన్సీ సర్జరీ చేయగా ఆ పదార్థం మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటి ఆర్టిలరీ షెల్ అని తేలింది.