మహబూబ్ నగర్ : కక్షిదారులకు సత్వర న్యాయం అందాలని,రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కు కృషి చేయాలని న్యాయవాదులు,న్యాయ మూర్తులను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి,మహబూబ్ నగర్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ ఎన్.వి.శ్రావణ్ కుమార్ (mJustice N.V. Shravan Kumar ) అన్నారు.
మహబూబ్ నగర్( Mahabub nagar ) జిల్లా కేంద్రంలో రూ. 81 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన కోర్టు భవన సముదాయానికి ( Court Building) హైకోర్ట్ న్యాయ మూర్తులు జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి, జస్టిస్ టి.మాధవి, జస్టిస్ నందికొండ నర్సింగరావు లతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం లో జస్టిస్ ఎన్.వి.శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కోర్టు భవనం 2 ఎకరాల 5 గుంటల స్థలంలో సరిపోని విధంగా ఉందని,నూతన కోర్టు భవన సముదాయం విశాలంగా నిర్మించాలని ప్రభుత్వం 14 నవంబర్ 2024 లో ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లాకు భౌగోళికంగా, పరిపాలన పరంగా ప్రాముఖ్యత ఉందని,వ్యవసాయం జీవనోపాధి గా, పట్టణీకరణ తో అభివృద్ధి చెందుతున్న జిల్లా అని పేర్కొన్నారు. నూతన కోర్టు భవన సముదాయంతో కోర్టు కు వచ్చే కక్షి దారులకు సత్వర న్యాయం లభించాలని, ఈ దిశగా న్యాయవాదులు, న్యాయ మూర్తులు సమర్థవంతంగా పని చేయాలని అన్నారు.నవంబర్ 30 నాటికి మహబూబ్ నగర్ లో 18, 446 కేసులు పెండింగ్ లో నున్నట్లు తెలిపారు.మౌలిక సదుపాయాలు కల్పన తో కోర్టులో పెండింగ్ కేసులు తగ్గించే విధంగా న్యాయవాదులు కృషి చేయాలని అన్నారు.
జిల్లాలో కలెక్టర్, ఎస్పీ, ప్రధాన న్యాయ మూర్తిగా మహిళలు ఉండడం గొప్ప విషయమని పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు తగ్గించుకోవాలి. న్యాయవాదులు,కమ్యూనిటీ పెద్దలకు మధ్యవర్తిత్వం శిక్షణ నిస్తున్నట్లు తెలిపారు. కేసులు పెండింగ్ సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉంటే ప్రజలు వ్యవస్థ పై విశ్వాసం కోల్పోతారని తెలిపారు . సమావేశంలో ప్రిన్సిపల్ అండ్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ఎన్.ప్రేమలత, కలెక్టర్ విజయేందిర బోయి,ఎస్.పి.డి.జానకి, అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ భుజంగ రావు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర మైనార్ట్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ చైర్మన్ అనంత రెడ్డి, ప్రధాన కార్య దర్శి శ్రీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.