చిత్రదుర్గ, సెప్టెంబర్ 1: లైంగిక దాడి కేసులో లింగాయత్ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణారును కర్ణాటక పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. మఠానికి చెందిన పాఠశాలలో చదువుకొంటున్న ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఆరు రోజుల తర్వాత ఆయన్ని అరెస్టు చేయడం గమనార్హం. మైసూరు పోలీసులు శరణారుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 15, 16 ఏండ్ల వయసు గల ఇద్దరు బాలికలు మఠానికి చెందిన హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు.
మూడున్నరేండ్లుగా శరణారు వారిపై లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని మైనర్ల తరపున పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇద్దరిలో ఒకరు దళిత బాలిక కూడా ఉండటంతో శరణారుపై అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. అంతకుముందు ఈ కేసులో హాస్టల్ వార్డెన్ రష్మీని కూడా పోలీసులు అరెస్టు చేశారు. శరణారు అరెస్టు నేపథ్యంలో చిత్రదుర్గలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.