‘లైగర్’ సినిమా షూటింగ్ కోసం చిత్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ ఇటీవలే అమెరికా పయనమైన విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్‌టైసన్ నటించబోతున్నారు. తాజా అమెరికా షెడ్యూల్లో విజయ్ దేవరకొండ, మైక్టైసన్పై ముఖ్య పోరాటఘట్టాల్ని తెరకెక్కించనున్నారు. అమెరికా షెడ్యూల్లో మైక్‌టైసన్ జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో తీయించుకున్న ఓ ఫొటోను విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ‘టైసన్‌తో గడుపుతున్న ప్రతి నిమిషాన్ని గొప్ప జ్ఞాపకాలుగా భద్రపరచుకుంటున్నా. ఆయన ప్రేమకు నిర్వచనం. ఈ ఫొటో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. లైగర్ వర్సెస్ లెజెండ్..’ అంటూ ఫొటోపై వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ పతాకాలపై కరణ్‌జోహార్, పూరి జగన్నాథ్, ఛార్మి, అపూర్వ మెహతా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.