చిక్కడపల్లి : మిస్ వరల్డ్ (Miss World ) అందాల పోటీలను ప్రతిఘటించాలని పలువురు మహిళా సంఘం నాయకురాలు పిలుపునిచ్చారు. మిస్ వరల్డ్ అందాల పోటీల వ్యతిరేక వేదిక ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అందాల పోటీలపై సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా రచయిత్రి జూపాక సుభద్ర, పీవోడబ్ల్యూ జాతీయ నాయకురాలు సంధ్య (POW leader V Sandhya) మాట్లాడారు.
మే నెలలో హైదరాబాదులో ప్రపంచ సుందరి పోటీలను తెలంగాణ టూరిజం ,హెరిటేజ్ , సాంస్కృతిక శాఖ నిర్వహిస్తుందని తెలిపారు. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ అధినేత జూలియా మెర్లీ తదితరులు తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాదుకు ఉన్న ఘన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను పరిగణలోకి తీసుకొని అందాల పోటీలకు వేదికగా నిర్ణయించామని ప్రకటించారని తెలిపారు.
అయితే తెలంగాణ రాష్ట్రం ఎంతో పోరాట చరిత్ర గలదని, నైజాం రాజులకు , దొరలకు , భూస్వాములకు, యూనియన్ సైన్యానికి, వడ్డీ వ్యాపారస్తులకు ఎదురొడ్డి నిలిచిన సాయుధ రైతాంగ పోరాట వారసత్వం ఈ నేల సొంతమని అన్నారు. రజాకారులపై తిరగబడ్డ ఆత్మస్థైర్యం ఇక్కడి మహిళలది పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు గడిచినా ఇంకా 26 శాతం అక్షర జ్ఞానానికి దూరంగా ,పేదరికంలో 143 దేశాలలో 136వ దేశంగా ,ఆకలి సూచీలో 116 దేశాల్లో 101 గా ఉన్న భారతదేశంలో 80 కోట్ల మంది ప్రజలు ఆహార భద్రత పథకంలో రేషన్ బియ్యం( Rationa Rice) కొరకు ఎదురుచూస్తున్నారని తెలిపారు.
దేశంలో అందాల పోటీలు ఎవరికోసమని ప్రశ్నించారు. అందాల పోటీల మీద పెట్టే ఖర్చుతో గ్రామీణ హాస్టళ్లు, పాఠశాలల్లో మంచినీళ్లు , టాయిలెట్ సౌకర్యాలను, వైద్య సౌకర్యాలను, చారిత్రక ప్రదేశాలలో వసతులను, భద్రతను మెరుగుపరచవచ్చని వారు వెల్లడించారు. మహిళలకు , యువతకు , వ్యాయామశాలలు ,గ్రంథాలయాలు ఏర్పాటు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వివిధ మహిళా సంఘాల నాయకులు అనసూయ , ఆశాలత, స్వరూప, జ్యోతి , శ్రీదేవి ,లావణ్య , స్త్రీ విముక్తి, శాంత , జ్యోతి, జయ, ఝాన్సీ, ప్రదీప్, జాన్, మహేష్, సత్య, తేజ, జ్యోతి వహీద్,అంబిక, అనిల్, మమత ,అరుణ తదితరులు పాల్గొన్నారు.