ఆంగ్ల సంవత్సరాదిని ఆశావాదంతో ఆహ్వానిద్దాం. ప్రతి క్షణాన్నీ సద్వినియోగం చేసుకుందాం. ప్రతి ఆలోచననూ మంచివైపు మళ్లిద్దాం. ప్రతి సంఘటన నుంచీ పాఠం నేర్చుకుందాం. యోగా, ధ్యానం, ప్రాణాయామం.. నిత్య జీవితంలో భాగంగా మార్చుకుందాం. మన శ్వాస, మన ధ్యాస.. రెండూ అత్యంత శక్తిమంతమైనవి. మన శరీరాన్ని, మనసునూ కూడా ప్రభావితం చేస్తాయి. పచ్చని ప్రకృతి పట్ల కృతజ్ఞతతో మెలుగుదాం. ఈ సృష్టికి అసలైన యజమానులు వృక్షాలు, జంతుజాతులే. మనిషి అతిథిగా వచ్చాడు. కానీ యజమానిలా వ్యవహరిస్తున్నాడు.
జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యా మనల్ని ఏదో ఒక కోణంలో బలవంతులుగా తీర్చిదిద్దుతుంది. మంచి అనుభవాలు సుఖాలను కలిగిస్తాయి. కేవలం కష్టాలే ఎదురవుతూ ఉంటే మనిషి మనుగడ దుర్భరం అవుతుంది. అలాగని అన్నీ సుఖాలే ఉన్నా జీవితం చప్పగా ఉంటుంది. సుఖదుఃఖాల కలయికగా ఉన్నప్పుడే జీవితం పరిపూర్ణం అవుతుంది. కాలానికి ఇదే స్వభావం ఉంటుంది. కాలగమనంలో కొన్ని అద్భుతమైన ఆనందాన్నిచ్చే క్షణాలు ఉంటాయి, మరికొన్ని క్షణాలు నిర్లిప్తంగా సాగిపోతాయి. ప్రతికూల క్షణాలను ఎదుర్కోవాలంటే అందుకు తగ్గ బలం, ధైర్యం, జ్ఞానం కావాలి. మనకు జరిగే మంచిని ఇతరులతో పంచుకునే గుణమూ ఉండాలి.
జీవితంలో ఎటువంటి సవాళ్లు ఎదురైనా వాటిని ఎదుర్కొని, ప్రపంచాన్ని మరింత ఆనందకరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మనలో మనం సుస్థిరంగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ప్రతి మనిషిలో ఒక నటుడు, ఒక సాక్షి ఉంటారు. అంతరంగపు లోతుల్లోకి వెళ్లినప్పుడు మనలోని సాక్షి మరింత బలపడతాడు. లౌకిక విషయాలకు ప్రభావితం కాకుండా ఉండగలుగుతాడు. బాహ్య ప్రపంచంలోకి వెళ్లినప్పుడు మనలోని నటుడు బలం పుంజుకొని, పరిస్థితులకు తగ్గట్టుగా ప్రవర్తించే నైపుణ్యాన్ని పొందుతాడు. పరస్పరం విరుద్ధంగా ఉన్న ఈ రెండూ ధ్యానంతో పెంపొందుతాయి. కొత్త సంవత్సరం మొదలైంది. ఈ సందర్భంగా మన అంతరంగంలో మరింత స్థిరంగా ఉండి, ప్రపంచాన్ని మంగళకరంగా మార్చే దిశగా అడుగులు వేద్దాం. కాలం మనుషులను మారుస్తుంది. అయితే కొందరు మనుషులు కాలాన్నే మారుస్తారు. ప్రతి వ్యక్తి అలాంటి శక్తి కావాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
-గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్