మహబూబ్ నగర్ కలెక్టరేట్ : నిత్య జీవితంలో ప్లాస్టిక్ ( Plastic Pollution ) వాడకాన్ని నిర్మూలించి పర్యావరణ కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి (Collector Vijayendira Bo i) అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మయూరి పార్క్ వద్ద రహదారి వెంబడి ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించే డ్రైవ్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా అధికారులు, విద్యార్థులతో కలిసి ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్‌ను జయిద్దాం అనే థీమ్ తో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి, ఆహార భద్రతకు ముప్పు కలిగిస్తుందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి వెళ్ళడం వల్ల సముద్ర జీవులు మరణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్లాస్టిక్ కణాలు మట్టి, నీరు, ఆహారంలోకి చేరి మానవులకు హాని కలిగిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన , వకృత్వం,డ్రాయింగ్ పోటీలలో గెలుపొందిన వారికి మెమెంటోలు అందజేశారు. పర్యావరణ కాలుష్య మండలి ద్వారా జూట్ తో తయారు చేసిన బ్యాగ్ లను విద్యార్థులకు పంపిణీ చేశారు.అంతకు ముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో సత్య నారాయణ, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్, డీపీఆర్వో శ్రీనివాస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ కల్వ భాస్కర్, పరిశ్రమల శాఖ జీఎం ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.