e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 24, 2022
Home News విద్యుత్తు బిల్లును అడ్డుకొంటాం

విద్యుత్తు బిల్లును అడ్డుకొంటాం

  • నినదించిన విద్యుత్తు ఉద్యోగులు
  • రాష్ట్రవ్యాప్తంగా హోరెత్తిన నిరసనలు
  • 15న ఢిల్లీ జంతర్‌మంతర్‌లో ధర్నా
  • ఫిబ్రవరి ఒకటిన దేశవ్యాప్త సమ్మె
  • టీఎస్‌పీఈ జేఏసీ కన్వీనర్‌ రత్నాకర్‌రావు వెల్లడి

హైదరాబాద్‌ సిటీబ్యూరో, డిసెంబర్‌ 8 (నమస్తే తెలంగాణ)/నెట్‌వర్క్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న విద్యుత్తు సవరణ బిల్లు-2021ను అడ్డుకొని తీరుతామని విద్యుత్తు ఉద్యోగులు నినదించారు. రాష్ర్టాల హక్కులు, వినియోగదారులకు నష్టం చేకూర్చేలా ఉన్న ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. విద్యుత్తు ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. హైదరాబాద్‌లోని మింట్‌ కాంపౌండ్‌ టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ కేంద్ర కార్యాలయం ఎదుట తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

జేఏసీ కన్వీనర్‌ రత్నాకర్‌రావు మాట్లాడుతూ.. ఈ నెల 15న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేపడుతున్నట్టు తెలిపారు. ఆ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదింపచేస్తే మరుక్షణమే దేశవ్యాప్తంగా ఉన్న 15 లక్షల మంది విద్యుత్తు ఉద్యోగులతో ఫిబ్రవరి 1న నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. రాష్ర్టాల హక్కులను కాలరాస్తూ, పేదలకు సబ్సిడీ కింద ఇచ్చే విద్యుత్తును కార్పొరేట్‌ శక్తులకు అప్పగించడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు డాక్టర్‌ చంద్రుడు, వేణు, కరుణాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌, గోపాల్‌ మేడి రమేశ్‌, ఈశ్వర్‌ గౌడ్‌, నాగరాజు, తలసీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

మిన్నంటిన నిరసనలు
విద్యుత్తు సవరణ బిల్లు-2021ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు హోరెత్తాయి. రైతులు, వినియోగదారులు దశాబ్దాలుగా కష్టపడి నిర్మించుకున్న విద్యుత్తు సంస్థలకు.. ఈ బిల్లు ప్రమాదకరమని జేఏసీ కన్వీనర్‌ ఎన్‌ శివాజీ ఆరోపించారు. సోమాజిగూడలోని విద్యుత్తుసౌధ ఆవరణలో జేఏసీ కో కన్వీనర్‌ పీ అంజయ్య, నాయకులు నాజర్‌ షరీఫ్‌, గణేశ్‌, యూసుఫ్‌, రామేశ్వరయ్యశెట్టి, తుల్జారాంసింగ్‌ తదితరులతో కలిసి నిరసన తెలిపారు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూర్‌ కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు ప్రధాన గేటు ఎదుట కేటీపీపీ ఇంజినీర్లు, ఉద్యోగులు నిరసన తెలిపారు. భద్రాద్రి జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌ 5, 6వ దశల సీఈ కార్యాలయం ఎదుట టీఆర్‌వీకేఎస్‌ రాష్ట్ర సీనియర్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, జెన్కో కార్యదర్శి చారుగుండ్ల రమేశ్‌, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ నాయకుడు ఎండీ సమీర్‌, రామకృష్ణజాదవ్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ జలవిద్యుత్తు కేంద్రం ప్రధాన గేటు వద్ద విద్యుత్తు ఇంజినీర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు సందీప్‌రెడ్డి, నాయకులు వంశీకృష్ణ, వరప్రసాద్‌, రామకృష్ణ, రాజు, కృష్ణప్రసాద్‌, మధుసూదన్‌రెడ్డి తదితరులు నిరసన తెలిపారు. హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్తు భవన్‌లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ జేఏసీ చైర్మన్‌ కేవీ జాన్సన్‌, తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ నాయకులు సామ్యనాయక్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం బీ థర్మల్‌ విద్యుత్తు కేంద్రం ఎదుట తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ జేఏసీ ఆధ్వర్యంలో, కరీంనగర్‌లోని ఎస్‌ఈ సర్కిల్‌ కార్యాలయ ఆవరణలో ఉద్యోగులు విధులు బహిష్కరించి ధర్నా చేశారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement