న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో ఆడ చిరుతపులి(Leopard) మృతిచెందింది. దాని వయసు సుమారు రెండు నుంచి రెండున్నర ఏళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గురుగ్రామ్-ఫరీదాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న ఆరావలి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానిక ఎన్జీవో వన్యప్రాణి అధికారుల్ని అలర్ట్ చేసింది. ప్రమాద ప్రాంతానికి చేరుకున్న అధికారులు ఆ చిరుతను కస్టడీలోకి తీసుకుని పోస్టుమార్టమ్ నిర్వహిస్తున్నారు. బహుశా ఇది హిట్ అండ్ రన్ కేసు అయి ఉంటుందని వైల్డ్‌లైఫ్ ఆఫీసర్ ఆర్కే జాంగ్రా తెలిపారు. పోస్టుమార్టమ్ నిర్వహిస్తున్నామని, అతివేగంగా ప్రయాణించే వాహనాలతో ఈ ప్రాంతంలో సమస్యలు వస్తున్నట్లు ఆయన చెప్పారు.
గురుగ్రామ్-ఫరీదాబాద్ మార్గంలో ఉన్న అసోలా భాటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, అరావలి పర్వతాల మధ్య తరుచుగా చిరుతపులులు సంచరిస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రాంతంలో ప్రమాదాలు కూడా అధికంగా అవుతున్నట్లు గుర్తించారు. గురుగ్రామ్ సమీపంలోని ఆరావలి కొండల్లో సుమారు 50 చిరుత పులులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో అవి తరుచూ కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. 2019లో కూడా ఇదే మార్గంలో రోడ్డు ప్రమాదానికి ఓ చిరుత బలైనట్లు పేర్కొన్నారు.