బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ నిర్వహించిన రథ యాత్ర దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది. మందిర్ రాజకీయాలకు ఈ రథయాత్ర పునాదిగా మారింది. ఇంత పాపులర్ అయిన రథయాత్రకు గాన కోకిల లతా మంగేష్కర్ పాడిన పాట సిగ్నేచర్ ట్యూన్ గా స్థానం సంపాదించుకుందంటే అతిశయోక్తి కాదు. ఈ విషయాన్ని రథ యాత్రికుడు, బీజేపీ సీనియర్ నేత ఎల్.కే. అద్వానీయే వెల్లడించారు. భారత రత్న లతా మంగేష్కర్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆమెకు శ్రద్ధాంజలి ఘటించిన అద్వానీ… ఆమెతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ ఈ విషయాన్ని వెల్లడించారు.
1990 లో అద్వానీ నిర్వహించిన సోమనాథ్ రథయాత్రలో లతా పాడిన రామ భజన్ ఆ యాత్రకు ‘సిగ్నేచర్ ట్యూన్’గా మారిపోయిందని అద్వానీ గుర్తు చేసుకున్నారు. లతా మంగేష్కర్ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ప్రపంచంలోని సంగీత ప్రియులందరూ ఆమెను ఆదర్శంగా తీసుకుంటారని, భవిష్యత్ సంగీత తరాలు ఆమెను స్ఫూర్తిగా తీసుకుంటాయని అద్వానీ తెలిపారు.