గద్వాల: లైసెన్స్డ్ సర్వేయర్లు ( Licensed surveyors ) నూతన సాంకేతికతను ( New technology ) అభ్యసించి, క్షేత్రస్థాయిలో అమలు చేసినప్పుడే భూసర్వేలు ఖచ్చితత్వంతో నిర్వహించవచ్చని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ( Collector Santosh ) అన్నారు . సోమవారం జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి చట్టం-2025ను తీసుకువచ్చిందని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ తదితర ప్రక్రియల్లో తప్పనిసరిగా సర్వే చేసి మ్యాప్ జత చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం లైసెన్స్ పొందిన సర్వేయర్లకు శిక్షణ అవసరమని వివరించారు. సాంకేతికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, భూసర్వేలో డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ వంటి ఆధునిక పరికరాల వినియోగం అనివార్యమైందని పేర్కొన్నారు.
ఈ టెక్నాలజీ ద్వారా భూ కొలతలు అత్యంత ఖచ్చితంగా, తక్కువ సమయంలో గుర్తించడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ,ముఖ్యంగా వ్యవసాయ భూముల హద్దులు, పరిమితులను స్పష్టంగా గుర్తించి భవిష్యత్తులో తలెత్తే భూవివాదాలను సమర్థవంతంగా నివారించవచ్చని తెలిపారు.ఈ శిక్షణలో ఉపయోగించే పరికరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వే ల్యాండ్ అండ్ రికార్డ్స్ ఏడీ రామ్ చందర్, మండల సర్వేయర్లు, అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు.