బెర్లిన్: జర్మన్ ఓపెన్‌లో యువ షట్లర్ లక్ష్యసేన్ సంచలనం సృష్టించాడు. సహచర షట్లర్లు నిష్క్రమించిన వేళ తాను ఉన్నానంటూ టైటిల్ వేటలో మరో ముందడుగు వేశాడు. శనివారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్యసేన్ 21-13, 12-21, 22-20 తేడాతో టాప్‌సీడ్ విక్టర్ అక్సెల్సన్(డెన్మార్క్)పై అద్భుత విజయం సాధించాడు. తన కంటే మెరుగైన ర్యాంక్ లో ఉన్న ప్లేయర్‌పై లక్ష్య అంచనాలకు మించి రాణించాడు. గంటా పదినిమిషాల పాటు జరిగిన పోరులో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. తొలి గేమ్‌ను లక్ష్యసేన్ కైవసం చేసుకోగా, రెండో గేమ్‌ను విక్టర్ ఖాతాలో వేసుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఇద్దరు షట్లర్లు కడదాకా నువ్వానేనా అన్నట్లు పోరాడారు. ఆదివారం జరిగే ఫైనల్లో విదిత్సర్ణ్తో లక్ష్యసేన్ తలపడుతాడు.