పెద్దఅంబర్‌పేట, డిసెంబర్ 16 : ‘ఫలానా వీధిలో ప్రగతి పని కోసం కౌన్సిల్లో తీర్మానం చేయాలి.. ఇంజినీరింగ్ అధికారులు ఎస్టిమేషన్ వేయాలి.. టెండర్లు పిలవాలి.. షెడ్యూల్ వివరాలను పత్రికల్లో ప్రచురించాలి.. ఆన్లైన్ టెండర్లు కావడంతో లెస్ కోట్ చేసినవారు పనులు దక్కించుకోవాలి.. ఆ కాంట్రాక్టరు పనులు సకాలంలో పూర్తి చేయాలి.. అదే సమయంలో క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీలు పనులు పరిశీలించాలి.. నాణ్యతగా ఉన్నాయని నివేదిక ఇస్తేనే బిల్లులు ఇవ్వాలి.. ఏ మున్సిపాలిటీలోనైనా ఏదైనా పని చేయాలంటే జరిగే ప్రక్రియ ఇదీ..’
కానీ, పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలోని పలువురు ప్రజాప్రతినిధులు చట్టం చెబుతున్న నిబంధనలకు నీళ్లొదిలారు. కౌన్సిల్లో తీర్మానం ఆమోదం పొందగానే కొందరు ప్రజాప్రతినిధులు నేరుగా పనులు మొదలు పెట్టేశారు. ఎలాంటి టెండర్ల ప్రక్రియ చేపట్టకుండానే పనులు ప్రారంభించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పనులు దాదాపు సగం పూర్తయినా ఇంకా టెండర్ల ప్రక్రియ మొదలుకాని పరిస్థితి నెలకొన్నది. రూ.కోట్ల విలువైన పనులపై పర్యవేక్షణ కొరవడింది. టెండర్లు కాకుండానే పనులు పూర్తవడంతో నాణ్యత పరీక్ష ఎలా సాధ్యమవుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మున్సిపాలిటీలో కొన్ని వార్డులు మినహా అన్ని వార్డుల్లో ఈ తరహా పనులు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
పనులు చకచకా.. టెండర్లు తీరికగా..
మున్సిపల్ పాలకవర్గాల గడువు సమీపిస్తుండడంతో వార్డుల్లో జోరుగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చకాచకా నడుస్తున్నాయి. అయితే, వాటిపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. కనీసం పనుల వైపు అధికారులు కన్నెత్తి చూడటంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పనులు నాణ్యతగా లేకపోతే త్వరగా పాడయ్యే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు విన్నవించుకున్నా అధికారులు అటువైపు చూడడంలేదని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే పలువురు ప్రజాప్రతినిధులు చేపడుతున్న పనులకు అసలు టెండర్లే పిలవలేదనే ఆరోపణలు ఉన్నాయి. టెండర్ల ప్రక్రియను ప్రారంభించకముందే పనులు మొదలు పెట్టినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్టిమేషన్, టెండర్లే పిలువకుండా చేపడుతున్న పనులను అధికారులు ఎలా పరిశీలిస్తారనే విషయం సంశయంగా మారింది. ఇలా పలు వార్డుల్లో కలిపి రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులు నడుస్తున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొన్నిచోట్ల పనులు పూర్తి కాగా, మరికొన్ని చోట్ల సగం వరకు పూర్తయ్యాయి. అధికారుల పర్యవేక్షణ కరువైన వేళ వేసిన సీసీ రోడ్లకు పూర్తిస్థాయిలో నీళ్లు పెట్టడంలేదని స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటీవల పెద్దఅంబర్‌పేటలోని ఓ వార్డులో రోడ్లకు నీళ్లే పట్టడంలేదని స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు అటువైపు చూడలేదనే విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులు స్పందించాలని, పనులు నాణ్యతగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ప్రజలు కోరుతున్నారు.