వాళ్ళు సుక్క పొద్దునే లేచి
సూర్యుని నిద్ర లేపుతారు
అవనిపై అడుగులు వేస్తూ
పూట కోసం వేటను మొదలెడతారు
కాళ్ళకు చక్రాలను కట్టుకొని
ముంతలో ముద్ద నెట్టుకొని
అంచుకు తొక్కును రాసుకొని
అరిగిన పాదాలతో అడ్డమీది కొచ్చి
సంతలో ఎద్దోలే సక్కంగా నిలబడతారు
పొయ్యిని వెలిగించే సూర్యుల కోసం
దిగులు పక్షిలా దిగాలుగా చూస్తారు
వాళ్ళకు కండల నిండా
ఆత్మాభిమానం ఆకాశమంతుంటది
కానీ.. పేదరికం కాలనాగై కాటేస్తుంది
వాళ్ళకు గుండెల నిండా విశ్వాసం
సాగరమంతుంటది కానీ..
అవసరాల తోరణాలు వెక్కిరిస్తుంటది
వాళ్ళ మనసంతా మల్లె పువ్వు కానీ
గతమంతా నెర్రబారిన నేల వంటిది
చెమట చుక్కలను చిందించడమే కానీ
జేబులకు చిల్లులు పెట్టడం తెలియదు
పనిలో సరిగమలను పాడించడమే కానీ
మోసపు కట్టెలు పేర్చడం తెలియదు
వాళ్ళని చులకనగా చూడకండి
పరుషపు మాటలతో
వాళ్ళ పెయ్యిని జల్లెడ చేయకండి
తాటిపాముల రమేశ్
79815 66031