హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ సమ్మె డిమాండ్లపై ఈడీల కమిటీతో కార్మిక సంఘాల సమావేశం శనివారం బస్‌భవన్‌లో జరిగింది. సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను చెల్లించాలనే అంశంపై కీలక చర్చ జరిగింది. రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతి నెలా రూ.10 కోట్లు ఇస్తామని యాజమాన్యం తెలిపింది. దీనిపై కార్మికసంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రతి నెలా కనీసం రూ.100 కోట్లు ఇవ్వాలని కోరాయి.
దశలవారీగా ప్రతినెలా పెంచి ఆ డబ్బులు సర్దుబాటు చేయడానికి కృషి చేస్తామని యాజమాన్యం చెప్పింది. రిజెక్ట్ అయిన హయ్యర్ పెన్షన్ దరఖాస్తులను పరిషరించడానికి ఆర్టీసీ తరఫున జూనియర్ సేల్ ఆఫీసర్‌ను జూలై నెలలో నియమిస్తామని చెప్పారు.
2019 సమ్మె కాలపు పోలీస్ కేసులు ఎత్తివేయడానికి ప్రభుత్వానికి యాజమాన్యం ద్వారా లేఖ పంపుతామని వెల్లడించారు. ఉద్యోగభద్రత విషయంపై కూడా చాలాసేపు చర్చ జరిగింది. టికెట్ తీసుకుని ప్రయాణించే బాధ్యత పూర్తిగా ప్రయాణికులదే ఉండాలని కార్మిక సంఘాలు కోరాయి. అలాగే కండక్టర్, డ్రైవర్లపై ఎలాంటి కేసులు రాయకూడదని వాదించారు. దీనిపై కమిటీ వేస్తామని.. కమిటీకి కార్మికసంఘాల అభిప్రాయాలను తెలియజేయాలని సూచించారు. బ్రెడ్ విన్నర్ సీమ్ కింద పనిచేస్తున్న వారందరినీ రెగ్యులర్ చేసేందుకు అంగీకరించారు.