Labani Behera : ఈ రోజుల్లో 60, 70 ఏళ్లు వస్తే చాలు చాలామంది మధుమేహం (Diabetis), అధిక రక్తపోటు (High blood pressure) లాంటి దీర్ఘకాలిక వ్యాధులు, మోకాళ్ల నొప్పులు (Knee pains), కీళ్ల నొప్పులు (Asteo Artherites) లాంటి శారీరక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఏ పనీ చేయలేక సంతానంపై ఆధారపడి జీవనం గడుపుతున్నారు. కానీ ఒడిశా (Odisha) కు రాష్ట్రానికి చెందిన లబణి బెహెరా (Labani Behera) అనే వృద్ధుడు మాత్రం 106 ఏళ్ల వయసొచ్చినా ఆరోగ్యంగా ఉన్నాడు. తన పనులు తాను చేసుకోవడం మాత్రమేగాక, ఏకంగా చాయ్ దుకాణమే నడుపుతూ వ్యాపారం కూడా చేస్తున్నాడు.
ఇంతకీ ఈ లబణి బెహెరా ఎవరు..? ఈ వయసులోనూ ఆయన ఎందుకు చాయ్ దుకాణం నిర్వహిస్తున్నారు..? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. లబణి బెహెరా ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని గడకణ ప్రాంతానికి చెందినవారు. ఆయన 40 సంవత్సరాల క్రితం ప్రారంభించిన టీ దుకాణాన్ని ఇప్పటికీ నడుపుతున్నారు. రోజూ ఉదయం 4 గంటలకు లేచి.. వాకింగ్‌కు వచ్చే వారికి చాయ్ సిద్ధం చేస్తున్నారు. 1989లో మాంచేశ్వర్ రైల్వే చౌక్ వద్ద ప్రారంభమైన ఈ దుకాణం అప్పట్లో రోజుకు 70 లీటర్ల పాలతో నడిచేది. అప్పుడు పాల ధర లీటరుకు 10 పైసలు. టీ ధర కూడా చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు అదే దుకాణం రోజుకు 340 లీటర్ల పాలతో చేసిన చాయ్ విక్రయించే స్థాయికి చేరింది.
లబణికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం కుమారుడు కుంజ్ బిహారీ బెహెరాతో కలిసి లబణి టీ దుకాణాన్ని నడుపుతున్నారు. ఈ వయసులో కూడా తన తండ్రి లబణి ఎవరిపైనా ఆధారపడటంలేదని ఆయన కుమారుడు కుంజ్ బిహారి చెబుతున్నారు. నిజానికి చాయ్ దుకాణం నిర్వహణలో తానే తండ్రిపై ఆధారపడుతున్నానని చెప్పారు. అయితే లబణి చాయ్ దుకాణం కేవలం చాయ్ తాగే స్థలం కాదు. అది ఒక సామాజిక వేదిక కూడా. రోజూ ఉదయం వాకింగ్‌కు వచ్చేవాళ్లు, వివిధ వర్గాల ప్రజలు ఆయనతో మాట్లాడుతుంటారు. వేడివేడి చాయ్పాటు ఆయన అనుభవ కథలు వినడానికి అందరూ ఆసక్తి చూపుతుంటారు.
లబణి బెహెరా సరళత, మృదువైన మాటలు, చిరునవ్వు ఆయనను అందరికీ ఆత్మీయుడిగా మార్చాయి. లబణి తమకు ప్రేరణ అని స్థానిక అంబులెన్స్ డ్రైవర్ అశోక్ కుమార్ పాణి చెప్పారు. ఈ వయసులోనూ ఆయన ఆరోగ్యం, చురుకుదనం తమను ఆశ్చర్యపరుస్తాయని అశోక్ అన్నారు. రోజు తమ దినచర్య ఆయన టీతోనే ప్రారంభమవుతుందని తెలిపారు. లబణి రుచికరమైన టీ తయారు చేస్తారని, ఆయన స్వాభిమానం, గౌరవప్రదమైన వ్యక్తిత్వంవల్ల స్థానికులు ఆయనను ఎంతో గౌరవిస్తారని చెప్పారు. కాగా కష్టపడి సంపాదిస్తున్న లబణి ప్రభుత్వ వృద్ధాప్య పింఛన్‌ను కూడా తిరస్కరించారు. 106 ఏళ్ల వయసులోనూ కష్టపడి జీవిస్తున్న లబణి బెహెరా జీవితం, మారుతున్న సమాజానికి విలువల పాఠంగా నిలుస్తోందని పలువురు అంటున్నారు.
ఇదిలావుంటే లబణి చాయ్ దుకాణం రేపు సోమవారం (ఏప్రిల్ 13న) 78వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ సందర్భంలో లబణి బెహెరా తన అనుభవాలను పంచుకున్నారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రణాళికలతో నగరం రూపుదిద్దుకోవడం ఆయనకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుందని చెప్పారు.