హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 30: కాకతీయ యూనివర్సిటీ కామన్మెస్(Common Mess)లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్ డైరెక్టర్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ విద్యార్థులు నిరసన తెలిపారు. తమకు రోజూ ఉడికీ ఉడకని అన్నం, నీళ్లచారు పెడుతున్నారని.. ఏమాత్రం మెనూ పాటించడంలేదని, నాసిరకం భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో రుచిశుచిలేని భోజనం పెడుతున్నారని ఇటీవల విద్యార్థులు రోడ్డెక్కి నిరసన కూడా తెలిపారు. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం విద్యార్థులు హాస్టల్ డైరెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కామన్మెస్లో ఆందోళన చేపట్టారు. హాస్టల్ డైరెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని నినదించారు.
ఆగస్టు, అక్టోబర్ నెలల్లో కామన్మెస్ బిల్లుల్లో హాస్టల్ డైరెక్టర్ అక్రమాలకు పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపించారు. హాలీడేస్‌లో మూసివేసిన కామన్మెస్ఖు కూడా టిఫిన్, భోజనాలు పెట్టినట్లు బిల్లులు పెట్టినట్లు విద్యార్థులు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల నుంచి హాస్టల్ బిల్లుల రూపంలో అప్పనంగా దోచుకుంటున్నారని వారు అన్నారు. యూనివర్సిటీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ హాస్టల్ డైరెక్టర్‌పై చర్యలు తీసుకోలేదని స్టూడెంట్స్ వెల్లడించారు. విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న కేయూ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కామన్మెస్కు చేరుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు.