సిరిసిల్ల టౌన్, మార్చి 5 : బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఓ నిరుపేద యువతి వివాహానికి ఆర్థిక సాయం అందజేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 12వ వార్డుకు చెందిన భార్గవి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. ఆమె తన సోదరి, సోదరుడితో కలిసి బంధువుల ఇంట్లో ఉంటున్నది. ఆమె వివాహం ఈ నెల 12న జరగనుండగా, స్థానిక బీఆర్ఎస్ నాయకులు భార్గవి కుటుంబ పరిస్థితిని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
మానవతా దృక్పథంతో స్పందించిన కేటీఆర్.. భార్గవి వివాహానికి రూ.50 వేల నగదుతోపాటు వివాహ కానుకను పంపించారు. ఈ మేరకు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో గురువారం భార్గవి కుటుంబ సభ్యులకు నగదుతోపాటు కానుకను అందజేశారు. ఈ సందర్భంగా భార్గవి కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, కౌన్సిలర్లు మొగిలి నాగరాజు, బూర బాలు, బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి మ్యాన రవి తదితరులు పాల్గొన్నారు.