హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారి చదువుకు బీఆర్ఎస్ నేతలు రూ.2.50 లక్షల ఆర్థిక సాయం అందించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా ఎర్రగడ్డకు చెందిన పేద విద్యార్థిని ఆఫ్రీన్ పూర్తి విద్యా బాధ్యతలను పార్టీ సీనియర్ నాయకురాలు, ఎర్రగడ్డ డివిజన్, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన బొంతల రజితారావు స్వీకరించారు. ఆఫ్రీన్ పీజీ వరకు చదువుకునేలా ఖర్చులను తానే భరిస్తానని భరోసా ఇచ్చారు. మంగళవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్ చేతుల మీదుగా చిన్నారి తల్లికి రూ.2.50 లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.
హరిబాబుకు కేటీఆర్ అభినందన
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పొందిన బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఆవాల హరిబాబును కేటీఆర్ అభినందించారు. ‘ఉత్తర తెలంగాణ పాటలు-సామాజిక చైతన్యం’ అనే అంశంపై హరిబాబు చేసిన పరిశోధనకు ఓయూ డాక్టరేట్ ప్రకటించింది. తెలంగాణభవన్‌లో మంగళవారం కేటీఆర్‌ను హరిబాబు కలిశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి విద్యార్థి, తెలంగాణ సమాజానికి మరింత సేవ చేయాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఇక్కడ బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ తదితరులున్నారు.
కేటీఆర్‌ను కలిసిన పెద్ద్ది స్వప్న
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి, వరంగల్ జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ స్వప్న మంగళవారం తెలంగాణభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. పెద్ది కుటుంబ యోగక్షేమాలు, పిల్లల చదువుల గురించి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ ముఖ్యనాయకులతో త్వరలోనే సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు.