Kalyana Lakshmi | పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు భరోసా ఇవ్వాలనే సదాశయంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం అంకురార్పణ చేసిన కల్యాణలక్ష్మీ పథకానికి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్(ఎక్స్) వేదికగా స్పందించారు. కూతురి పెళ్లి కోసం తల్లిదండ్రులు అప్పులపాలయ్యే పరిస్థితిని ప్రస్తావిస్తూ.. ఈ పథకానికి దారితీసిన సందర్భాలను గుర్తుచేశారు. కళ్యాణలక్ష్మి పథకం అమలులోకి వచ్చి ఈ రోజుతో 12 ఏళ్ళు నిండిన శుభ సమయాన… లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
కేసీఆర్ మానవనీయ పాలనకు నిదర్శనం కల్యాణలక్ష్మీ పథకం అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక గిరిజన తండాలో తమ బిడ్డ పెండ్లి కోసం ఓ కుటుంబం పడిన కష్టాన్ని స్వయంగా చూసిన ఓ సంఘటన ప్రేరణగా కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఉద్యమ సమయంలో బానోతు కీమా నాయక్ తన కుమార్తె పెండ్లి కోసం దాచుకున్న సొమ్ము మొత్తం కోల్పోయిన ఘటనను కేసీఆర్ చూసి చలించిపోయి.. ఆ కుటుంబానికి సాయం చేశారని పేర్కొన్నారు. ఆ ఒక్క కుటుంబానికే కాకుండా తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ కుటుంబానికి అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలు తీసుకొచ్చారని చెప్పారు. తెలంగాణలోని లక్షల కుటుంబాలకు ఆడబిడ్డ పెండ్లి సమయంలో కేసీఆర్ మేనమామ లాగా నిలిచాడని.. పేద కుటుంబాలకు పెద్ద దిక్కైనాడని అన్నారు.
In India, a daughter's marriage often means a lifetime of debt for her parents
Behind the wedding lights and music, there is always a family counting loans
KCR garu understood this pain when a tribal father, Banothu Keemanayak shared his tragic story of losing the savings he… pic.twitter.com/2vu6H7LumQ
— KTR (@KTRBRS) October 2, 2026
పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ. 1,00,116 కానుకగా అందించాలన్న ఆలోచన కేసీఆర్కు తప్ప ప్రపంచంలోని ఏ నాయకుడికి రాలేదని కేటీఆర్ అన్నారు. ఆడబిడ్డ పెళ్లి సమయంలో తల్లిదండ్రుల మీద ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ పథకం ఉపయోగపడింది. బాల్య వివాహాలను కూడా తగ్గించిందన్నారు. గత పన్నెండేళ్లలో కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ ద్వారా 16.78 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరిందని వెల్లడించారు. 16 లక్షలకు పైగా కుటుంబాలకు రూ.16,375 కోట్లకు పైగా సాయం అందిందని తెలిపారు.
కూతురి పెళ్లి అంటే తల్లిదండ్రులకు అప్పుల భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ పథకం పనిచేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. 16 లక్షలకు పైగా ఆడబిడ్డల కుటుంబాలకు ఈ పథకం అండగా నిలిచిందని తెలిపారు. కానీ కాంగ్రెస్ వచ్చాక కళ్యాణలక్ష్మి పథకాన్ని నీరుగార్చడమే కాకుండా.. పూర్తిగా రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కళ్యాణలక్ష్మితో పాటు ఇస్తానన్న తులం బంగారం దేవుడెరుగు, అసలు ఈ పథకమే లేకుండా చేసేందుకు రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నాడని చెప్పారు.