
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ గ్రామంలో ఆరేండ్ల చిన్నారిపై జరిగిన లైంగికదాడి ఘటన అత్యంత బాధాకరమని పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లోని నిలోఫర్ దవాఖానలో చికిత్స పొందుతున్న బాలికను బుధవారం నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావుతో కలిసి ఆయన పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సమాజంలో ఇలాంటి ఘటనలు జరగటం బాధాకరమని పేర్కొన్నారు. నిందితుడు ఎవరైనా కఠిన శిక్ష పడాల్సిందేనని స్పష్టంచేశారు.