హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): భారత్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా హైదరాబాద్‌లో కీలక భేటీ జరిగింది. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుతో భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్గ్రీన్ గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ హిల్లరీ మెక్ గీచీ కూడా పాల్గొన్నారు.
హైదరాబాద్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనాలు, వ్యూహాత్మక అంశాలపై విస్తృతంగా చర్చించారు. గతంలో పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రిగా పని చేసిన అనుభవంతో కేటీఆర్.. తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలను ఆస్ట్రేలియా ప్రతినిధులకు వివరించారు.
ముఖ్యంగా ఆస్ట్రేలియా పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సాంకేతిక రంగంలో పరస్పర సహకారం, విద్యారంగంలో నూతన భాగస్వామ్యాల గురించి ప్రస్తావించారు. ఐటీ, గ్రీన్ఎనర్జీ, ఫార్మా, ఇన్నోవేషన్ రంగాల్లో హైదరాబాద్ కేంద్రం గా జరుగుతున్న అభివృద్ధి, తెలంగాణ-ఆస్ట్రేలియా మధ్య సహకారం భవిష్యత్తులో స్థానిక యువతకు మరిన్ని అంతర్జాతీయ అవకాశాలను కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న అభివృద్ధిని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ, ఆస్ట్రేలియా మధ్య సహకారం పెరుగడం వల్ల భవిష్యత్తులో స్థానిక యువతకు మరిన్ని ఉపాధి, వ్యాపారావకాశాలు లభిస్తాయని ప్రతినిధి బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఉన్న దృఢమైన మైత్రిని ఈ చర్చలు మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయని నేతలు పేరొన్నారు.