హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన తెలంగాణ బిడ్డల ఓట్లు పోకుండా కాపాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసానిచ్చారు. ఇందుకు పార్టీ బీఎల్ఏల (బూత్ లెవల్ ఏజెంట్ల) సహకారం తీసుకుంటామని స్పష్టంచేశారు. ఇదే విషయంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి విన్నవిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నివాసంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు.
సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై సుదీర్ఘంగా చర్చించారు. ‘సర్’పై లక్షలాది మంది తెలంగాణ ఎన్ఆర్ఐలు ఆందోళన చెందుతున్న విషయాన్ని ప్రస్తావించారు. కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు పార్టీ తరఫున సీనియర్ ప్రతినిధి, నేతలతో కూడిన బృందా న్ని పంపిస్తామని తెలిపారు.
బూత్ లెవల్ ఏజెంట్లు గల్ఫ్‌లో ఉంటున్న తెలంగాణవాసుల వివరాలు సేకరించాలని కేటీఆర్ సూచించారు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లా నాయకులు, నియోజకవర్గాల ఇన్చార్జులు ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. పార్టీ బీఎల్ఏలతో సమన్వయం చేసుకోవాలని కోరారు.
నిజామాబాద్ జిల్లా గులాబీ పార్టీకి కంచుకోట అని కేటీఆర్ తెలిపారు. పార్టీ స్థాపించిన తొలి నాళ్లలోనే జిల్లా పరిషత్‌ను కైవసం చేసుకున్నట్లు గుర్తు చేశారు. ఆ జిల్లాలో పార్టీని మ రింత బలోపేతం చేయాల్సిన అ వసరం ఉన్నదని చెప్పారు. కార్యకర్తలు పార్టీ సభ్యత్వ నమోదును ఒక అవకాశంగా తీసుకోవాలని నిర్దేశించారు. పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకు ఉద్యమంలా చేపట్టాలని కోరారు. ఉమ్మడి నాయకులు తమ నియోజకవర్గాల్లోని పరిస్థితులను వివరించారు. కాంగ్రెస్ సర్కార్ అస్తవ్యస్త విధానాలతో ప్రజలంతా తిరిగి కేసీఆర్‌వైపు చూస్తున్నారని తెలిపారు.