KTR | ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలిపారు. భారతీయ సంగీత ప్రపంచం ఒక అపురూపమైన స్వరాన్ని కోల్పోయిందని అన్నారు. సుమారు 8 దశాబ్దాల పాటు తన గాత్రంతో కోట్లాది మందిని అలరించిన పద్మవిభూషణ్ ఆశా భోంస్లే మరణ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు.
ఆశా భోంస్లే కేవలం ఒక గాయని మాత్రమే కాదని.. భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక శకమని కేటీఆర్ కొనియాడారు. వేల సంఖ్యలో ఆమె పాడిన పాటలు తరతరాలకీ సంగీత పాఠాలుగా నిలిచిపోతాయని అభిప్రాయపడ్డారు. తెలుగులో కూడా ఆమె పాడిన మధుర గీతాలు మనందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉంటాయని అన్నారు. ఆమె మరణం భారతీయ కళా జగత్తుకు తీరని లోటు అని వ్యాఖ్యానించారు.
ఆశా భోంస్లే ఆత్మకు శాంతి చేకూరాలని కేటీఆర్ కోరారు. ఆమె కుటుంబసభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.