ఆయన అకాలమరణం తీరని లోటు
ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
సంగారెడ్డి, డిసెంబర్ 30 : మాజీ మంత్రి, పార్టీ నేత ఫరీదుద్దీన్ సేవలు చిరస్మరణీయమని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. వివిధ హోదాల్లో పనిచేసి రాష్ట్ర ప్రజలకు ఆయన ఎనలేని సేవలు అందించారని పేర్కొన్నారు. బుధవారం గుండెపోటుతో మృతిచెందిన ఫరీదుద్దీన్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో గురువారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హోతి(బీ)లో జరిగాయి. అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్, హోం మంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. జహీరాబాద్‌లోని బాగారెడ్డి స్టేడియంలో ఫరీదుద్దీన్ భౌతికకాయానికి మంత్రి మహమూద్ అలీ, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఫరీదుద్దీన్ మృతి టీఆర్ఎస్కు, రాష్ర్టానికి తీరనిలోటన్నారు. ఆయన ఉమ్మడి మెదక్ జిల్లాలోని నేతలు, ప్రజలు అందరికీ సుపరిచితుడని, అజాత శత్రువని కొనియాడారు. ఫరీదుద్దీన్ అకాల మరణ వార్త విన్న సీఎం కేసీఆర్.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని చెప్పారు. స్వయంగా అంత్యక్రియలకు హాజరుకావాల్సి ఉన్నదని, కానీ, స్వల్ప అనారోగ్యం కారణంగా రాలేకపోయారని తెలిపారు. ఫరీదుద్దీన్ వ్యక్తిత్వాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారి లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్‌ను ఆదేశించినట్టు చెప్పారు.
ఫరీదుద్దీన్ స్వగ్రామంలో అంత్యక్రియలు
హైదరాబాద్‌లో మృతి చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్ పార్థివదేహాన్ని గురువారం ఉదయం జహీరాబాద్‌కు తీసుకొచ్చారు. బాగారెడ్డి స్టేడియంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆయన పార్థివదేహాన్ని ఊరేగింపుగా పట్టణ శివారులోని ఈద్గాకు తీసుకొచ్చారు. అక్కడ ప్రార్థనల తర్వాత పార్థివదేహాన్ని స్వగ్రామమైన హోతి(బీ)కి తీసుకెళ్లారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం సమర్పించటంతోపాటు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ముస్లిం మతాచారం ప్రకారం ఫరీదుద్దీన్ అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు అక్కడే ఉన్న మంత్రి కేటీఆర్.. ఫరీదుద్దీన్ కుమారుడు తన్వీర్ అహ్మద్‌కు ఇతర కుటుంబసభ్యులకు మనోధైర్యం చెప్పి హైదరాబాద్‌కు పయనమయ్యారు. అంత్యక్రియల్లో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, యాదవరెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు బాలమల్లు, ఎర్రోళ్ల శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి, సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ రాజర్షిషా తదితరులు పాల్గొన్నారు.