హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : క్రీడా ప్రతిభ ఉండీ కిట్ కొనే స్థోమత లేక, ప్రయాణ ఖర్చులు కూడా భరించలేక అర్ధాంతరంగా తన ప్రయాణాన్ని ముగించుకొనే దయనీయ స్థితిలో ఉన్న యువ మహిళా క్రికెటర్ బత్తుల అక్షర ఆశలకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీవం పోశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటకు చెందిన నిరుపేద దంపతులు నర్సింహులు, లక్ష్మీ దంపతుల బిడ్డ అక్షరకు పూర్తి సహాయ సహకరాలు అందిస్తానని భరోసా ఇచ్చారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన అక్షర, దమ్మన్నపేట మోడల్ సూల్లో ఇంటర్ పూర్తిచేసింది.
కోచ్ ప్రసాద్ ప్రోత్సాహంతో సాధన చేస్తూ తొలుత ఉమ్మడి జిల్లా అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర అండర్-19 జట్టులోనూ స్థానం సంపాదించి ప్రతిభ చాటింది. రాష్ట్ర స్థాయికి ఎదిగినా క్రికెట్ కిట్, షూస్, ప్రొఫెషనల్ శిక్షణ, ప్రయాణ ఖర్చులు ఆమె కుటుంబానికి పెనుభారంగా మారాయి. నిరుపేద కుటుంబం కావడంతో తన క్రికెట్ కెరీర్ ఎకడ అర్ధాంతరంగా ముగిసిపోతుందోనన్న ఆందోళనతో అక్షర తన కష్టాలను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లింది. తన కుటుంబ నేపథ్యం, ఆర్థిక ఇబ్బందులను వివరించి సాయం కోరగా కేటీఆర్ ఆమెకు భరోసా ఇచ్చారు.
‘నీ క్రికెట్ ప్రయాణం ఎకడా ఆగకూడదు.. నీకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ అండగా ఉంటా’ అని హామీ ఇచ్చారు. కేటీఆర్ ఇచ్చిన భరోసాతో అక్షర, ఆమె కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో జాతీయ జట్టుకు ఆడి తెలంగాణకు, తమ ఊరికి పేరు తెస్తానని అక్షర ధీమా వ్యక్తం చేసింది.