ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతూ ఉన్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. నవంబర్ 27 ఉదయం ఆయన ఊరు నుంచి హైదరాబాద్కి తిరిగి వస్తుండగా హఠాత్తుగా ఆయనకు ఫిట్స్ వచ్చింది. ఆ తర్వాత కాసేపటికే ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు వైద్యులతో పాటు అతడి కుటుంబ సభ్యుల నుంచి కూడా అధికారిక సమాచారం వచ్చింది. కెఎస్ నాగేశ్వరరావు మరణవార్త తెలిసిన వెంటనే.. సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ప్రముఖ దర్శకుడు, నటుడు వీర శంకర్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా కేఎస్ నాగేశ్వరరావు మరణ వార్తను తెలియజేశారు. ఆయన ఫేస్బుక్లో పోస్ట్ పెడుతూ… మా గురువుగారి శిష్యుడు, మా చిరకాల మిత్రుడు, ప్రముఖ దర్శకుడు కె.యస్. నాగేశ్వరరావు నిన్న ఊరు నుంచి హైదరాబాద్కు కారులో వస్తున్నారు. మార్గ మధ్యంలో ఫిట్స్ రావడంతో సీరియస్ అయింది.
ఆయన కోదాడ వద్ద మరణించాడని తెలియజేయాల్సి రావడం చాలా బాధాకరంగా వుంది. ఈ ఉదయం నల్లజర్ల దగ్గరలోని కౌలురు గ్రామంలో వారి అత్తగారి ఇంటి వద్ద అంతిమ సంస్కారం జరగనుందని ఆయన కుమారుడు తెలియజేశాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని వీర శంకర్ తెలిపారు. నాగేశ్వర రావుకి కుమారుడు, కూతురు భార్య ఉన్నారు. దర్శకుడు మరణ వార్త విని టాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.
కేఎస్ నాగేశ్వరరావు కెరీర్ విషయానికి వస్తే.. వార్నింగ్ చిత్రంతో 1999లో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత శివన్న, దేశద్రోహి, రా, విజయశాంతి, ఇన్స్పెక్టర్, 786, శ్రీశైలం, బిచ్చగాడా? మజాకా? చిత్రాలకు దర్శకత్వం వహించారు. రచయితగా శ్రీశైలం, 786, ఇన్స్పెక్టర్, విజయశాంతి చిత్రాలకు పనిచేశారు. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న శ్రీహరిని పోలీస్ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేసిన ఘనత దర్శకుడిగా కేఎస్ నాగేశ్వరరావుకు దక్కింది.