హైదరాబాద్/సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): నేల తల్లి కలుషితం కాకుండా కాపాడుకొందామంటూ ప్రజలను చైతన్యం చేసేందుకు ఓ యువ సైక్లిస్టు సైకిల్ యాత్ర ప్రారంభించారు. జనగామ జిల్లా తరిగొప్పులకు చెందిన కొత్తపల్లి నాగరాజు.. యోగి సద్గురు (ఈశా ఫౌండేషన్) ‘మట్టిని పరిరక్షించు’ స్ఫూర్తితో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 2,200 కిలో మీటర్లు యాత్ర కొనసాగించనున్నారు. సేంద్రియ పద్ధతుల్లో భూమిని రక్షించుకోవడం, పర్యావరణ పరిరక్షణ అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ఆదివారం నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద సైకిల్‌యాత్రను సైక్లింగ్ కమిటీ జాతీయ కన్వీనర్, మర్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థాపక చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి జెండాఊపి ప్రారంభించారు. పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమైన తన యాత్ర నాగోల్ నుంచి ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల మీదుగా కొనసాగి ఈ నెల 24న నాగోల్‌కు చేరటంతో ముగుస్తుందని నాగరాజు పేర్కొన్నారు.
యూఎన్‌సీసీడీ అధ్యయనం ప్రకారం 2050 నాటికి భూమిపై 90 శాతం మట్టి సారం క్షీణిస్తుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా 52 శాతం వ్యవసాయ భూముల్లో సారం దెబ్బతిన్నదని అధ్యయనం చెప్తున్నది. అందుకే మట్టిలో 3 శాతం సేంద్రియ పదార్థం ఉండేలా అవగాహన కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సేవ్ సాయిల్ పేరుతో సద్గురు ఫౌండేషన్ అవగాహన కల్పిస్తున్నది. ఇందుకోసం స్వయంగా సద్గురు మార్చి 21 నుంచి 100 రోజుల పాటు 27 దేశాల్లో బైక్‌పై పర్యటిస్తున్నారు.
నాగరాజు 2013లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి, 2014లో మనాలీ టు కార్దుంగ్లా వరకు సైక్లింగ్ చేశాడు. 2015లో స్వచ్ఛ తెలంగాణ కోసం పది రోజులు పది జిల్లాల్లో 1,457 కిలో మీటర్లు, ప్రపంచ తెలుగు మహాసభల సమయంలో 1,750 కిలోమీటర్లు రైడ్ చేసి రెండు సార్లు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. తెలంగాణ ఆర్డినరీ సైక్లింగ్ రేసింగ్‌లో 2015లో గోల్డ్ మెడల్, ఆ తరువాత వరుసగా మూడేండ్లు సిల్వర్ మెడల్స్ గెలుపొందాడు. ప్రస్తుతం డికెత్లాన్ స్పోర్ట్స్‌లో వర్క్‌షాప్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.