సిటీబ్యూరో/సుల్తాన్‌బజార్, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : మహిళా సాధికారతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ మహిళల కోసం కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణలో మొట్టమొదటి మహిళా యూనివర్సిటీగా ఏర్పాటు చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో విద్యార్థులకు హాస్టల్ సదుపాయాలు, సైన్స్ ల్యాబులు, కంప్యూటర్ ల్యాబులు, ఇతర వసతులు ఏర్పాటు చేయనున్నారు.
2022-23 విద్యా సంవత్సరం నుంచే మహిళా యూనివర్సిటీలో యూజీ, పీజీకి సంబంధించిన పాత కోర్సులలో ప్రవేశాలు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ కాలేజీ ఫర్ ఉమెన్ కోఠి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విద్యుల్లత తెలిపారు. పై వచ్చే సంవత్సరం నాటికి బీఈడీ, ఇంజినీరింగ్, క్లాసికల్ వంటి కోర్సులు ప్రవేశ పెట్టే అవకాశాలు పరిశీలిస్తామని చెప్పారు.
కోఠి మహిళా కళాశాలను మహిళా విశ్వవిద్యాలయంగా మారుస్తూ రూ.100 కోట్లు కేటాయించడాన్ని హర్షిస్తూ సోమవారం కళాశాలలోని దర్బార్ హాల్ వద్ద వందలాది మంది విద్యార్థినులు, అధ్యాపకులు, సిబ్బంది సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా సెల్ఫీలు దిగుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
మహిళా యూనివర్సిటీ ఏర్పడటంతో విద్యార్థినులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థినులకు ఉన్నత విద్య అభ్యసించడానికి ఎంతో దోహదపడుతుంది. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే దేశాభివృద్ధి జరుగుతుంది. మహిళా సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– ప్రవళిక, విద్యార్థిని
రాష్ట్రంలో తొలి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై మహిళా విద్యార్థి లోకం సంబురాలు చేసుకుంటున్నది. మహిళలపై సీఎం కేసీఆర్‌కు ఉన్న ప్రేమ మరోసారి నిరూపితమైంది. యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేసిన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.
– ప్రొఫెసర్ రవీందర్,
మహిళా యూనివర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దీని వల్ల గ్రామీణ, పేద కుటుంబాలకు చెందిన మహిళా విద్యార్థుల గ్రాస్ ఎన్రోల్మెంట్ మెరుగుపడుతుంది. మహిళలు అన్ని రంగాల్లో రాణించడానికి మహిళా యూనివర్సిటీ దోహదపడుతుంది.
– ప్రొఫెసర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్
రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. మహిళలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేక డిగ్రీ గురుకులాలు, హాస్టళ్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు, ఒంటరి మహిళలకు పింఛన్లు ఇస్తూ.. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– ప్రొఫెసర్ విద్యుల్లత, ప్రిన్సిపల్, యూనివర్సిటీ కాలేజీ ఫర్ ఉమెన్ కోఠి
మా కళాశాలను విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దడం ఆనందంగా ఉంది. విద్యార్థినులు మరింత ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి మహిళా విశ్వవిద్యాలయం ఎంతగానో దోహదం చేస్తుంది. మాకు ఇదొక సదవకాశం. నూతన కోర్సులు, అత్యాధునిక ల్యాబ్‌ల ఏర్పాటుకు రూ.100 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.
– నమ్రతాసింగ్, విద్యార్థిని