అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐపీఎల్ 15వ సీజన్లో కోల్‌కతా బోణీ కొట్టింది. వెటరన్ ఆటగాళ్ల హవా సాగిన ఆరంభ పోరులో బ్యాట్‌తో మహేంద్రసింగ్ ధోనీ, బంతిలో డ్వైన్ బ్రేవో సత్తాచాటినా.. చెన్నైని గెలిపించలేకపోయారు. నైట్ రైడర్స్ తరఫున బంతితో ఉమేశ్ యాదవ్, బ్యాట్‌తో అజింక్యా రహానే రాణించడంతో కోల్‌కతా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ తొలి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. రెండేండ్ల తర్వాత స్వదేశంలో ప్రేక్షకుల కోలాహలం మధ్య సాగిన మ్యాచ్‌లో పెద్దగా మెరుపులు లేకపోయినా.. తమ అభిమాన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూసిన ఆనందం కనిపించింది!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ ఆరంభ పోరులో కోల్‌కతా విజయం సాధించింది. గతేడాది ఫైనల్లో చెన్నై చేతిలో దెబ్బతిన్న నైట్‌రైడర్స్.. అందుకు బదులు తీర్చుకుంది. లీగ్ ఆరంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా కొనసాగుతున్న మహేంద్రసింగ్ ధోనీ ఈ సీజన్‌కు ముందు సారథ్య బాధ్యతలు పక్కన పెట్టి కేవలం ఆటగాడిగా బరిలోకి దిగగా.. కెప్టెన్‌గా రవీంద్ర జడేజాకు తొలి మ్యాచ్‌లో నిరాశ ఎదురైంది. శనివారం జరిగిన మొదటి పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ (38 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు, ఒక సిక్సర్) విలువైన ఇన్నింగ్స్ ఆడగా.. రాబిన్ ఊతప్ప (28), కెప్టెన్ రవీంద్ర జడేజా (26 నాటౌట్) ఫర్వాలేదనిపించారు.
రుతురాజ్ గైక్వాడ్ (0), కాన్వే (3), అంబటి రాయుడు (15), శివమ్ దూబే (3) ఎక్కువసేపు నిలువలేకపోయారు. 17 ఓవర్లు ముగిసేసరికి 84/5తో నిలిచిన చెన్నై.. మహేంద్రుడి మెరుపులతో ఆఖరి మూడు ఓవర్లలో 47 పరుగులు పిండుకుంది. ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డ ధోనీ.. క్రీజులో కుదురుకున్నా భారీ షాట్లతో అభిమానులను అలరించాడు. ఐపీఎల్లో దాదాపు మూడేండ్ల తర్వాత ధోనీకి ఇది తొలి అర్ధశతకం కావడం విశేషం. కోల్‌కతా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం లక్ష్యఛేదనలో నైట్‌రైడర్స్ 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. టార్గెట్ పెద్దది కాకపోవడంతో కోల్‌కతా ఆటగాళ్లు ఆచితూచి ఆడారు. అజింక్యా రహానే (34 బంతుల్లో 44; 6 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్ కాగా.. బిల్లింగ్స్ (25), నితీశ్ రాణా (21), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (20 నాటౌట్) ఆకట్టుకున్నారు. చెన్నై బౌలర్లలో బ్రేవో మూడు వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్ యాదవ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. శనివారం డబుల్ హెడర్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.
సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 20 ఓవర్లలో 131/5 (ధోనీ 50 నాటౌట్, రాబిన్ ఊతప్ప 28; ఉమేశ్ యాదవ్ 2/20), కోల్‌కతా: 18.3 ఓవర్లలో 133/4 (అజింక్యా రహానే 44, బిల్లింగ్స్ 25; బ్రేవో 3/20).