పేరుకు తగ్గట్టే ఐపీఎల్-18కు అదిరిపోయే ఆరంభం! మ్యాచ్‌కు ముందు భయపెట్టిన వరుణుడు ఆట సమయానికి శాంతించినా ఇరు జట్ల బ్యాటర్లు పారించిన పరుగుల వరదలో క్రికెట్ అభిమానులు తడిసి ముద్దయ్యారు. బెంగళూరు బ్యాటర్లు ఆకలిగొన్న పులుల్లా కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడటంతో తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతాకు భంగపాటు తప్పలేదు. తాను క్రీజులో ఉన్నంతసేపు బంతిని బౌలర్ల చేతిలో కంటే బౌండరీ లైన్ ఆవలే ఎక్కువగా ఉంచిన సాల్ట్ వీరవిహారానికి తోడు పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ మరో క్లాసికల్ ఇన్నింగ్స్ తోడవడంతో కేకేఆర్‌పై ఆర్సీబీదే పైచేయి అయింది.
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు తొలి మ్యాచ్‌లోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఝలక్ ఇచ్చింది. పరుగులు వరద పారిన ఈడెన్ గార్డెన్స్‌లో బెంగళూరు.. కోల్‌కతాను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించి సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. రన్మిషీన్ విరాట్ కోహ్లీ (36 బంతుల్లో 59 నాటౌట్, 4 ఫోర్లు, 3 సిక్సర్లు), విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ (31 బంతుల్లో 56, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ రజత్ పాటిదార్ (34) వీరవిహారం చేయడంతో కేకేఆర్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ మరో 22 బంతులు మిగిలుండగానే దంచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతాను సారథి అజింక్యా రహానే (56), నరైన్ (44) ఆదుకున్నా మిడిలార్డర్ వైఫల్యంతో ఆ జట్టు 174/8 వద్దే ఆగిపోయింది. కృనాల్ (3/29), హెజిల్వుడ్ (2/22) ప్రత్యర్థిని కట్టడిచేశారు. కృనాల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
కోహ్లీ, సాల్ట్ వీరవిహారం
ప్లేబోల్డ్! ఆర్సీబీ ట్యాగ్‌లైన్ ఇది. దీని అర్థమేంటో బెంగళూరు ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే సాల్ట్, కోహ్లీ ప్రత్యర్థులకు తమ ఆటతీరుతో చెప్పేశారు. ఈ ఓపెనింగ్ జోడీ దూకుడుతో కోల్‌కతా లక్ష్యం చిన్నబోయింది. తొలి పవర్ ప్లే లోనే ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసిందంటే వాళ్ల దూకుడు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వైభవ్ అరోరా వేసిన మొదటి ఓవర్ తొలి బంతినే అద్భుతమైన కవర్ డ్రైవ్‌తో బౌండరీకి తరలించిన అతడు.. పరుగుల వేటను ఘనంగా మొదలుపెట్టాడు. అతడే వేసిన మూడో ఓవర్లో 4, 6, 4తో విధ్వంసానికి శ్రీకారం చుట్టాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లో అయితే ఓ భారీ సిక్సర్‌తో పాటు మూడు బౌండరీలతో 21 పరుగులు రాబట్టాడు. సాల్ట్ విజృంభణతో మరో ఎండ్‌లో కోహ్లీ కూడా రెచ్చిపోయాడు. సాధారణంగా ప్రారంభంలో నెమ్మదిగా ఆడి తర్వాత విజృంభించే కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. స్పెన్సర్ జాన్సన్ 5వ ఓవర్లో లాంగాఫ్ మీదుగా తనదైన ట్రేడ్ మార్క్ సిక్సర్లతో అలరించాడు. 25 బంతుల్లోనే సాల్ట్ హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. ప్రమాదకరగా పరిణమిస్తున్న ఈ జోడీని ఎట్టకేలకు చక్రవర్తే 9వ ఓవర్లో విడదీయడంతో 95 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. సాల్ట్ నిష్క్రమించే సమయానికి బెంగళూరు.. లక్ష్యంలో సగాన్ని పూర్తి చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. పడిక్కల్ (10) కూడా నిరాశపరిచినా రజత్, లివింగ్స్టన్ (5 బంతుల్లో 15 నాటౌట్) దూకుడుగా ఆడటంతో బెంగళూరు బోణీ కొట్టింది.
రహానే-నరైన్ షో
కోల్‌కతా ఇన్నింగ్స్‌లో రహానే, ఓపెనర్ నరైన్ ఇన్నింగ్సే హైలైట్. ఈ ఇద్దరూ ఉన్నంతవరకూ కోల్‌కతా 10 రన్‌రేట్‌కు తగ్గకుండా పరుగులు రాబట్టింది. కానీ ఈ ద్వయం నిష్క్రమించిన తర్వాత మిడిలార్డర్ కుప్పకూలడంతో మోస్తరు స్కోరుకే పరిమితమైంది. డికాక్ (4).. హెజిల్వుడ్ వేసిన తొలి ఓవర్లో రెండో బంతినే బౌండరీకి తరలించాడు. కానీ అదే ఓవర్లో ఐదో బంతికి ఔట్ అయ్యాడు. 3 ఓవర్లకు కేకేఆర్ స్కోరు 9/1. కానీ పవర్ ప్లే ముగిసేసరికి అది 60/1గా నిలిచింది.సలామ్ వేసిన నాలుగో ఓవర్లో రహానే 4, 6, 6తో గేర్ మార్చాడు. కృనాల్ వేసిన మరుసటి ఓవర్లో నరైన్ కూడా 6, 4తో విజృంభించాడు. 25 బంతుల్లోనే రహానే.. అర్ధ సెంచరీని నమోదుచేశాడు.
కోహ్లీ బౌలింగ్! ఫ్యాన్స్ ట్రోలింగ్
కోహ్లీ బౌలింగ్ వేయడమేంటి? అదీ ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్‌లో ఫస్ట్ ఓవర్! కానీ లీగ్ బ్రాడ్‌కాస్టర్ ‘స్టార్’ చేసిన తప్పిదమిది. బెంగళూరు బౌలింగ్ దాడిని హెజిల్వుడ్ ఆరంభించినా స్టార్ మాత్రం.. తొలి నాలుగు బంతులపాటు అతడి పేరును కోహ్లీగానే చూపించడంతో నెటిజన్లు ఆటాడుకున్నారు.
కృనాల్ మాయకు విలవిల
సాఫీగా సాగుతున్న కేకేఆర్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ నుంచి గాడి తప్పింది. రసిక్ వేసిన 10వ ఓవర్లో నరైన్.. జితేశ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కృనాల్ వరుస ఓవర్లలో కోల్‌కతాకు షాకులిచ్చాడు. అతడు వేసిన 11వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన రహానే.. రసిక్‌కు క్యాచ్ ఇచ్చాడు. కృనాల్ తన తర్వాతి ఓవర్లలో వెంకటేశ్ (6), రింకూ సింగ్ (12)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. సుయాశ్ 16వ ఓవర్లో ఆండ్రీ రస్సెల్ (4)నూ బౌల్డ్ చేయడంతో కేకేఆర్ కోలుకోలేకపోయింది.
కోల్‌కతా: 20 ఓవర్లలో 174/8 (రహానే 56, నరైన్ 44, కృనాల్ 3/29, హెజిల్వుడ్ 2/22)
బెంగళూరు: 16.2 ఓవర్లలో 177/3 (కోహ్లీ 59 నాటౌట్, సాల్ట్ 56, నరైన్ 1/27, వైభవ్ 1/42)