కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 2 : పుస్తక పఠనంతో విజ్ఞానం పెరుగుతుందని, జ్ఞాన సముపార్జనకు పుస్తకాలు ఎంతో దోహదపడుతాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్లోని జ్యోతిరావు పూలే పార్లో ఏర్పాటు చేసిన కరీంనగర్ పుస్తక మహోత్సవాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. కరీంనగర్ జిల్లా కవులు, కళాకారుల ఖిల్లా అని అభివర్ణించారు. పుస్తకం సమాజాన్ని మార్చుతుందని, పుస్తకాలు చదవడం వల్లే ఎందరో గొప్పవారయ్యారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుస్తక ప్రియుడని, వేల పుస్తకాలను చదవడం వల్లే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. జిల్లాకు చెందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పుస్తకాలు చదవడంతోపాటు అనేక పుస్తకాలు రాశారని, ఆర్థికవేత్తగా అంతర్జాతీయంగా పేరు గడించారని కొనియాడారు. డాక్టర్ సీ నారాయణరెడ్డి గొప్ప కవిగా గుర్తింపు తెచ్చుకున్నారని, పద్మ విభూషణ్ శ్రీభాష్యం విజయసారథి సంసృత పండితుడిగా, నలిమెల భాసర్ బహుభాషావేత్తగా గుర్తింపు పొందారన్నారు. పిల్లలు పుస్తకాలు చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, గురుకుల పాఠశాలలకు విజ్ఞానం పెంపొందించే పుస్తకాలను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. పుస్తక ప్రదర్శనలో 50 స్టాళ్లలో ఏర్పాటు చేసిన 20 వేల పుస్తకాలను విద్యార్థులు, మహిళలు, ప్రజలు తిలకించి తమకు నచ్చిన ఏదైనా ఒక పుస్తకం కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, డీఆర్డీవో శ్రీలత, డీఎంహెచ్వో జువేరియా, డీఈవో జనార్దన్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, కార్పొరేటర్లు, సాహితీవేత్తలు, కవులు, రచయితలు, పుస్తకప్రియులు, మహిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా కవులు, రచయితల గడ్డ. ఎందరో ప్రముఖులు ఈ జిల్లాలో జన్మించారు. ఆధునికయుగంలో పుస్తకపఠనం తగ్గంది. ఎక్కువ మంది సెల్ఫోన్లకు బానిసలవుతున్నారు. దీని వల్ల మేలు కంటే కీడు ఎక్కువ జరుగుతున్నది. కానీ, పుస్తక పఠనంతోనే విజ్ఞానం పెంపొందుతుంది. చైతన్యం కలుగుతుంది. విద్యార్థులు తప్పకుండా పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి. మంచి పుస్తకాలను కొనుగోలు చేయాలి.
– బొమ్మ హేమాదేవి వేదికపై ఏర్పాటు చేసిన సభలో కరీంనగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురసరించుకుని పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశాం. అందులో భాగంగా మహిళల కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి జరిగే కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సద్వినియోగం చేసుకోవాలి. ప్రతిరోజూ సాయంత్రం సాహితీ కార్యక్రమాలు, సాంసృతిక ప్రదర్శనలు ఉంటాయి. తెలంగాణ వంటకాల స్టాళ్లు కూడా ఉంటాయి. యువత సెల్ఫోన్లను అవసరం మేరకు వినియోగించుకోవాలి. పుస్తక పఠనానికి ఎకువ ప్రాధాన్యమివ్వాలి. కరీంనగర్ జిల్లాలో తొలి రచయిత్రి బొమ్మ హేమాదేవి పేరిట వేదిక ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం.
– ఆర్వీ కర్ణన్, కరీంనగర్ కలెక్టర్
విద్యార్థులు సెల్ఫోన్లకు బానిసలు కావద్దు. పుస్తకపఠనం అలవాటు చేసుకోవాలి. తప్పనిసరిగా మహనీయుల జీవిత చరిత్రలు, విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలను చదవాలి. పోలీసు కుటుంబాలు పుస్తక ప్రదర్శనను తిలకించేలా చూస్తాం.
– వీ సత్యనారాయణ, కరీంనగర్ సీపీ