సుజుక : ఫార్ములావన్ చాంపియన్‌షిప్‌లో ఇటలీ యువ రేసర్ కిమీ ఆంటోనెలి వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. ఆదివారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన జపాన్ గ్రాండ్ ప్రి రేసులో 19 ఏండ్ల ఆంటోనెలి టైటిల్ విజేతగా నిలిచాడు. సరిగ్గా రెండు వారాల క్రితం చైనా గ్రాండ్ ప్రి గెలిచిన ఆంటోనెలి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. పోల్ పొజిషన్‌తో రేసును ప్రారంభించిన ఈ యువ సంచలనం 1:28:3:403 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు.
ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన మెర్సిడెస్ డ్రైవర్ ఆంటోనెలి..ప్రత్యర్థులను వెనుకకు నెడుతూ రెండో టైటిల్ దక్కించుకున్నాడు. ఆస్కార్ పియాస్ట్రి(మెక్లారెన్), చార్లెస్ లెక్రెక్(ఫెరారీ) వరుసగా రెండు, మూడు స్థానాలతో పోడియం ఫినిష్ చేశారు. ఇదే రేసులో పోటీపడ్డ స్టార్ రేసర్ లూయిస్ హామిల్టన్(6), వెర్స్టాపెన్(8) ఘోరంగా నిరాశపరిచారు.