నేలకొండపల్లి (కూసుమంచి), ఫిబ్రవరి 6: ‘మా కండ్లముందే యూరియా ఉంది. కానీ మాకు దొరకట్లేదు. మా ఊరి సొసైటీలో ఉన్న యూరియా బస్తాలను పొరుగు మండలాల రైతులొచ్చి తీసుకెళ్తున్నారు. యాప్లో బుక్ చేసుకోలేదన్న కారణంతో యూరియా బస్తాలు ఇవ్వడం లేదు. చిన్నఫోన్లు(కీప్యాడ్ ఫోన్లు) ఎత్తడమే సరిగా తెలియని మాకు.. పెద్ద ఫోన్ల (స్మార్ట్ఫోన్లు) గురించి ఎలా తెలుస్తుంది? వాటిల్లో యాప్లు పెట్టి వాటి ద్వారా బుక్ చేసుకుంటేనే ఎరువులు ఇస్తామంటే మేమేం చేయాలి?’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండ అన్నదాతలు. తమ గ్రామ సొసైటీకి వచ్చిన యూరియా బస్తాలను అధికారులు తమకు ఇవ్వడం లేదని, పొరుగు మండలాల రైతులు మొబైల్ యాప్ ద్వారా ముందుగానే బుక్ చేసుకున్నారన్న కారణంతో వారికే ఇస్తు న్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
బోదులబండకు చెందిన కొడాలి అచ్యుతరావు, ఎర్రా చలపతిరావు, రాయపాటి శ్రీనుతోపాటు పలువురు రైతులు యూరియా కోసం వారం రోజులుగా అదే గ్రామంలోని సొసైటీ వద్దకు తిరుగుతున్నారు. శుక్రవారం ఉదయం సొసై టీకి యూరియా లోడ్ వచ్చింది. సొసైటీ అధికారులు పంపిణీ ప్రారంభించినా అదే గ్రామ రైతులకు మాత్రం ఇవ్వడం లేదు. పొరుగు మండలాల రైతులకు ఇస్తుండడంతో వారు ఆటోలు కిరాయికి తీసుకొని మరీ బస్తాలను వేసుకొని వెళ్తున్నారు. ఇదేమిటని గ్రామ రైతులు అధికారులను అడిగారు. ‘ఆ రైతులు మొబైల్ యాప్ నుంచి ముందుగానే బుక్ చేసుకున్నారు. అందుకని వారికే ఇస్తున్నాం. బుక్ చేసుకోని వారికి ఇవ్వడం లేదు’ అని చెప్పడంతో ఆగ్రహించిన అన్నదాతలు.. సొసైటీ ఎదుట ఆందోళనకు దిగారు. అక్షరజ్ఞానం పెద్దగా లేని తాము స్మార్ట్ఫోన్లో ఎలా బుక్ చేసుకోవాలని ప్రశ్నించారు. ఓ రైతుకు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్లూరులో బుక్ అయితే రానూపోను నాలుగు గంటలపాటు ప్రయాణించి ఆ రైతు దానిని ఎలా తెచ్చుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు మార్చాలని డిమాండ్ చేశారు.