
ఖమ్మం, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలన నిరాశపరిచింది. ఇది రైతులు, పేదల వ్యతిరేక బడ్జెట్ అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కేంద్రం ఈసారి మొండిచేయి చూపింది. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పలనే చిరకాల డిమాండ్‌కు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల నుంచి ఏపీలోని రాజమండ్రి వరకు గోదావరి జల మార్గం ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను తుంగలో తొక్కింది. పారిశ్రామిక ప్రాంతాలైన భద్రాచలం (కొవ్వూరు), మణుగూరు రైల్వే ప్రాజెక్టుల ప్రస్తావనే లేదు. కొత్తగూడెంలో విమానాశ్రయ నిర్మాణానికి నిధుల కేటాయింపులు లేవు. భద్రాద్రి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల కోసం పాండురంగాపురం- సారపాక వరకు రైల్వే లైన్, భద్రాచలం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని కిరణ్‌డోల్ రైల్వే లైన్, గిరిజన యూనివర్సిటీ.. వంటి ఆశలన్నింటికీ నిరాశే మిగలింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలు, కుల వృత్తులు చేసేవారికి ఈ బడ్జెట్ మొండిచేయి చూపింది. వ్యవసాయ రంగం, కార్మిక రంగ సంక్షేమాన్ని కేంద్రం విస్మరించింది. ఆదాయం పన్ను చెల్లింపులో శ్లాబుల విధానాన్ని ప్రకటిస్తుందేమోనని ఆశగా ఎదురు చూసిన ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శూన్యాన్ని చూపింది. మొత్తంగా బడ్జెట్ అంకెల గారడీ మాత్రమే.
‘ఉపాధి’ పథకానికి నిధుల్లేవు..
ఉపాధి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది మందికి ఉపాధి అందుతుంది. కేంద్ర బడ్జెట్లో ఉపాధి పథకానికి కేటాయింపులు ఉంటాయని ప్రజలు ఆశించగా పూర్తిగా నిరాశే మిగిలింది. కేంద్రం కేటాయించిన నిధులు కంటి తుడుపు చర్యలే అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కేవలం అంకెల గారడీ మాత్రమేనంటున్నాయి. వంట నూనెల ఉత్పత్తి దేశీయంగా పెంచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇదే జరిగితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్ పాం రైతులకు మేలు జరుగనున్నది. ఉమ్మడి జిల్లాకు పామాయిల్ ఫ్యాక్టరీలు వచ్చే అవకాశం ఉన్నది.
ఉద్యోగాల మాటే లేదు..
కేంద్ర బడ్జెట్లో సామాన్యులకు ప్రాధాన్యం లేదు. కేంద్రానికి కనిపించడం లేదా? పేదలు బతకొద్దా? నిరుద్యోగుల కోసం కొలువుల మాటే లేదు.. వ్యవసాయానికి కేంద్రం ఏం కేటాయించింది? ఇంత దారణమైన బడ్జెట్ ఎప్పుడూ చూడలేదు. రాష్ర్టానికి రైళ్లు వస్తాయి. రైలు మార్గాలు వస్తాయి. అనుకుంటే అలాంటిది ఏమీ లేదు. కొవ్వూరు రైల్వే లైన్ కోసం ఎప్పటి నుంచో పోరాటాలు జరుగుతున్నాయి. అసలు దాని ఊసే బడ్జెట్లో లేదు. పస లేని బడ్జెట్ ప్రవేశపెట్టి కేంద్రం చేతులు దులుపుకున్నది.
వ్యవసాయ రంగానికి వ్యతిరేకం..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ రైతు వ్యతిరేక బడ్జెట్. రైతులను ఈ బడ్జెట్ పూర్తిగా విస్మరించింది. సామాన్య, మధ్య తరగతి ప్రజల కనీస అవసరాలను గుర్తించి బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని ఆశపడిన ప్రజలకు భంగపాటు మిగిలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మరోసారి అన్యా యం జరిగింది. బడ్జెట్లో బ య్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పా టు సంగతే లేదు. బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశ పరిచింది. ఒక దశ, దిశ లేని పద్దు. ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీని ప్రైవేట్ పరం చేయడం దారుణమైన తప్పిదం.
పూర్తిగా ఎన్నికల బడ్జెట్..
కేంద్ర బడ్జెట్ పూర్తిగా ఎన్నికల బడ్జెట్. కార్పొరేట్ కంపెనీల బడ్జెట్. సామాన్యులకు ఏమాత్రం ఉపయోగపడని పద్దు. ఇతర రాష్ర్టాల ఎన్నికల్లో అక్కడి ప్రజలను ఆకర్షించేందుకు బడ్జెట్ రూపొందించారు. ఈ పద్దు కేవలం అంకెల గారడీ. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన కేంద్రం దొడ్డి దారిన ఆ చట్టాలను తీసుకువచ్చేందుకు యత్నిస్తుందనడానికి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్టే నిదర్శనం. కేంద్రం నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపకపోగా అవాస్తవాలను ప్రకటించింది. మతోన్మాద విధానాలు, మైనార్టీలకు వ్యతిరేకమైన విధానాలు పూసలో దారంలాగా ఉన్నాయి.
పన్ను మినహాయింపు ఊసే లేదు..
రూ.పది లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయ పన్ను మినహాయింపు లేదు. ఆ కేటగిరీ ఉద్యోగుల డిమాండ్‌ను కేంద్ర బడ్జెట్ పట్టించుకోలేదు. దీంతో నిరాశే మిగిలింది. కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని పెట్టుకున్న ఆశలు నిరాశగానే మిగిలాయి. కనీసం ఆదాయ పన్నుకు సంబంధించి స్లాబ్ విధానమైనా అమల్లోకి తెస్తుందని భావించాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఆకాస్త వెలుసుబాటునూ కల్పించలేదు.
వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదు..
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అన్నివర్గాల ప్రజలను నిరాశ పరిచింది. రైతాంగం, సామాన్యులకు వ్యతిరేకంగా ఈ బడ్జెట్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కేంద్రం పట్టించుకోలేదు. ఇది పసలేని పద్దు. నిష్ప్రయోజనకర బడ్జెట్. విద్య, ప్రజారోగ్యం, మౌలిక రంగాల అభివృద్ధికి పద్దులో స్థానం లేకపోయింది. ప్రజల అవసరాలను దృష్ట్యా కాకుండా బీజేపీ సొంత ఎజెండాతో పద్దు రూపొందించింది. మసిపూసి మారెడు కాయ చేసింది. ఇది గోల్మాల్ బడ్జెట్.
తెలంగాణపై వివక్ష..
తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలను కేంద్రం విస్మరించింది. రాష్ర్టాభివృద్ధికి నిధులు కేటాయించడంలో వివక్ష చూపుతున్నది. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసే విధంగా పద్దు ఉన్నది. సామాన్యులకు ఏ మాత్రం ఉపయోగపడే విధంగా లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒక్క వరం కూడా లేదు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని ప్రజలు దశాబ్దాలుగా కోరుతున్నారు. ఇక ప్రజా పోరాటాలతోనే రాష్ర్టానికి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రావాల్సిన ప్రాజెక్టులు, హక్కులను సాధించుకుంటాం. బీజేపీ దుర్మార్గ వైఖరిని ఎండగడతాం.
ఆదాయ పన్ను రాయితీ లేదు. వేతన జీవుల వెతలు తీర్చలేదు.. కేంద్రం నిరుద్యోగులు, చిరువ్యాపారులపై చిన్నచూపు ప్రదర్శించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఉద్యోగులు, పేదలు, వృత్తిదారులకు మొండిచేయి చూపించింది. తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసింది. వ్యవసాయం, రైతుల సం‘క్షేమాన్ని’ విస్మరించింది. విద్యారంగం, ప్రజారోగ్యం, మౌలిక సదుపాయాల కల్పనలో రిక్తహస్తం చూపింది. చేనేత రంగంపై నిర్లక్ష్యం ప్రదర్శించింది. మొత్తంగా మంగళవారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్‌పై అన్నివర్గాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాటలగారడీతో మసిపూసి మారేడుకాయ చేశారని అభివర్ణిస్తున్నారు.
కేంద్రం మరోసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. బయ్యారం ఉక్కు పరిశ్రమ, చర్ల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి వరకు గోదావరి జలమార్గం ఏర్పాటు ప్రస్తావనే లేదు. భద్రాచలం, కొవ్వూరు, సారపాక, రైల్వేప్రాజెక్టుల ఏర్పాటు ఊసేలేదు. కొత్తగూడెం విమానాశ్రయానికి నిధుల కేటాయించకపోవడం, పలు సమస్యలకు పరిష్కారం చూపకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గొప్పలు తప్ప, ఇది పసలేని, పనికిమాలిన గోల్మాల్ బడ్జెట్ అని విమర్శిస్తున్నారు.
కార్మికులు, పేదలకు వ్యతిరేకం..
పేదలు, కార్మికులు, రైతులు, ఉద్యోగులు పెట్టుకున్న ఆశలన్నింటినీ కేంద్రం నీరుగార్చింది. ఈ బడ్జెట్‌తో నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేదు. కేంద్రం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించింది. బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ‘అమృతకాల్ బడ్జెట్’గా అభివర్ణించడం సహేతుకం కాదు. అమృతం తాగితే ఎవరు చనిపోరు. కానీ కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను చంపేస్తూ అమృత కాల్ అంటే ఎలా కుదురుతుంది ? వ్యవసాయం చేసి అప్పుల పాలైన రైతులకు ఉపశమనం కలిగించే ఒక్క వరం కూడా బడ్జెట్లో లేదు.
లోక్‌సభా పక్ష నేత విద్యారంగానికి అన్యాయం
తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నది. కేంద్రం మాత్రం తీవ్ర అన్యాయం చేస్తున్నది. రూల్ ప్రకారం స్థూల జాతీయోత్పత్తిలో ఆరుశాతం నిధులు బడ్జెట్లో కేటాయించాలి. కానీ, అలాంటిదేమీ జరగలేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 8శాతం నిరుద్యోగ సమస్య ఉంది. ప్రధాని మోదీ అనాలోచిత నిర్ణయాలతో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపో తున్నది. నిరుద్యోగులు, పేదల సంక్షేమాన్ని కేంద్రం విస్మరించింది. ఇన్‌కం టాక్స్‌లో స్లాబ్స్‌ను మార్చకపోవడం విచారకరం. ఇది ప్రజావ్యతిరేక బడ్జెట్.