హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): అనుభవం, జ్ఞానం ఉన్న నాయకులు రాజకీయాల్లో రాణించడమే కాకుండా ప్రజాసేవలో మంచిపేరు తెచ్చుకుంటారని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. గురువారం రాజ్యసభ నుంచి పదవీ విరమణ పొందిన 72 మంది సభ్యులకు సభ వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా కేశవరావు మా ట్లాడుతూ.. పదవీ విరమణ పొందుతున్న ఎంపీలు వారి సేవలను వివిధ హోదాల్లో అందించారని గుర్తుచేసుకొన్నారు. పదవీకాలం పూర్తి అయినంత మాత్రాన ప్రజాసేవకు దూరం కాజాలరని చెప్పారు. తెలుగు భాషలో ‘మళ్లీ కలుద్దాం’ అనే ఆశావహ ఆహ్వానం ఉన్నదని, అదృష్టం కలిసివస్తే వీరిలో అనేకులు సభకు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పారు. కేంద్ర మంత్రులుగా ఉన్న నలుగురు తప్పకుండా తిరిగి వస్తారని పేర్కొన్నారు. తనకు రాజ్యసభతో 16 ఏండ్ల అనుబంధం ఉన్నదని తెలిపారు.