న్యూఢిల్లీ, మే 13: ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ పదవ రోజుకు చేరుకుంటుండగా కేరళలో ఒక నిశ్శబ్ద తుపాను ముంచుకొస్తున్నది. కాంగ్రెస్‌లో తీవ్ర కల్లోలం నెలకొనడంతో కేసీ వేణుగోపాల్, వీడీ సతీశన్, రమేశ్ చెన్నితల పేరిట మూడు వర్గాలు ఏర్పడ్డాయి. కేసీ వేణుగోపాల్ వర్గ ఎమ్మెల్యేలను బుధవారం సతీశన్ మద్దతుదారులు ఘెరావ్ చేశారు. సీఎం అభ్యర్థిని నిర్ణయించేందుకు రాహుల్ గాంధీ మంగళవారం ఢిల్లీలో పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులతో సమావేశమయ్యారు. అప్పటికే ఫలితాలు వెలువడిన తర్వాత చివరి నిమిషంలో ముఖ్యమంత్రి బరిలోకి దిగిన వేణుగోపాల్‌కు మద్దతు ఇవ్వవద్దని గాంధీలను హెచ్చరిస్తూ జిల్లా కా ంగ్రెస్ కమిటీ కార్యాలయం వెలుపల పోస్టర్లు వెలిశాయి.
రాహుల్, ప్రియాంక వయనాడ్‌ను మరచిపోండి. మీరు ఇక్కడ నుంచి మళ్లీ గెలవలేరు అని ఒక పోస్టర్‌పై రాసి ఉండగా మరో పోస్టర్లో రాహుల్.. సీ(వేణుగోపాల్) మీ పనివాడు కావచ్చు. కానీ కేరళ ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు అన్న మాటలు ఉన్నాయి. మరో పోస్టర్లో ఆర్జీ(రాహుల్ గాంధీ, పీజీ(ప్రియాకం గాంధీ).. ఇది హెచ్చరిక కాదు. ఈ ఘోరానికి కేరళ మి మ్మల్ని ఎప్పటికీ క్షమించదు అన్న హెచ్చరిక ఉంది. 2019లో తన కంచుకోట అయిన అ మేథీలో రాహుల్ గాంధీ ఓటమిని గుర్తు చేస్తూ వయనాడ్ తదుపరి అమేథీగా మారవచ్చని మరో పోస్టర్ హెచ్చరించింది. రాహు ల్, ప్రి యాంకల మూర్ఖపు నిర్ణయాలను కేరళ అంగీకరించదని ఇంకో పోస్టర్లో పేర్కొన్నారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ నిర్ణయాత్మక మెజారిటీ సాధించినప్పటికీ ముఖ్యమంత్రి పదవిపై నెలకొన్న అనిశ్చితికి తెరదించాలని కాంగ్రెస్ నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతున్నది. నాయకుడిని ప్రకటించడంలో జరుగుతున్న జాప్యం పార్టీలోను, దాని మిత్రపక్షాల్లోనూ ఆందోళనను పెంచుతున్నది. ముఖ్యమంత్రి పదవి కోసం సతీశన్, వేణుగోపాల్, చెన్నితల పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నాయని తెలుస్తున్నది.. పార్టీ ఆ అంశంపై కసరత్తు చేస్తున్నందున ఢిల్లీలో తీవ్ర సంప్రదింపులు కొనసాగుతున్నాయి. రేసులో వేణుగోపాల్ ముందంజలో ఉన్నప్పటికీ అసెంబ్లీలో తమ స్థానాలను గెలుచుకున్న తర్వాత చెన్నితల, ముఖ్యంగా సతీశన్లను ఈ విజయానికి సూత్రధారులుగా పరిగణించారు.
అయితే వేణుగోపాల్‌కు ఉన్న పలుకుబడి, గాంధీలతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయన దృష్టిలో పడేందుకు గణనీయ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఏఐసీసీ పరిశీలకులకు ఆయన పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ సుదీర్ఘ నిరీక్షణ కాంగ్రెస్‌లో నాయకత్వం, అధికార పంపకాల ఏర్పాట్లపై తీవ్ర చర్చలకు దారితీసింది. పార్టీలోని వివిధ వర్గాలు ముఖ్యమంత్రి పదవికి వేర్వేరు అభ్యర్థులకు మద్దతు ఇస్తుండడంతో తుది నిర్ణయంపై అనిశ్చితి మరింత పెరుగుతున్నది. ఈ వ్యవహారం యూడీఎఫ్ భాగస్వామ్య పక్షాలు ముఖ్యంగా ఐయూఎంఎల్లో తీవ్ర అసహనానికి దారితీసింది.
ఈ సుదీర్ఘ నిర్ణయరాహిత్యం ప్రజలకు, అలాగే కూటమి కార్యకర్తలకు తప్పుడు సంకేతాలను పంపుతున్నదని కొందరు లీగ్ నాయకులు బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఇక ఎంతమాత్రం జాప్యం లేకుండా ఈ సమస్యను పరిష్కరించాలని ఐయూఎంఎల్లోని కొందరు నాయకులు ఇటీవల కాంగ్రెస్‌ను కోరారు. ఇది సుదీర్ఘంగా కొనసాగిన పక్షంలో ఎన్నికల విజయం తర్వాత కూటమి పొందిన ఊపును బలహీనపర్చవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో అంతర్గత దుమారం చెలరేగుతున్న తరుణంలో బీజేపీ, ఎల్డీఎఫ్ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాయి. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తూ ఓటర్ల నుంచి స్పష్టమైన తీర్పు వచ్చినా నాయకత్వంపై ఏకాభిప్రాయానికి రాలేకపోయిందని ఆ పార్టీపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
న్యూఢిల్లీ, మే 13: కేరళ ముఖ్యమంత్రి ఎంపికకు సంబంధించిన చర్చలన్నీ పూర్తయ్యాయని, గురువారం కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రకటిస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం సాయంత్రం ఇక్కడ సమావేశమై తుది విడత చర్చలు జరిపారు. అగ్రనాయకుల 40 నిమిషాల సమావేశం అనంతరం కాంగ్రెస ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్లు) జైరామ్ రమేష్ విలేకరులతో మాట్లాడుతూ కేరళలోని కాంగ్రెస్ శాసనసభా పక్షం సభ్యుల అభ్యర్థన మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం అన్ని చర్చలను పూర్తి చేసిందని కేరళ తదుపరి ముఖ్యమంత్రి గురించి గురువారం నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేసులో కేసీ వేణుగోపాల్, వీడీ సతీశన్, రమేష్ చెన్నితల పోటీపడుతుండగా ఎంపిక పూర్తయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని వెంటనే ప్రకటించకుండా ఎందుకు గురువారం వరకు వేచిచూస్తున్నదో తెలియరాలేదు.