హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమస్ఫూర్తి దేశానికి అవసరమనే భావన అందరిలోనూ కలుగుతున్నది. ఆయన మేధోసంపత్తి, సమతాస్ఫూర్తి కోసం యావత్తు దేశం ఎదురుచూస్తున్నది. దేశ్‌కీ నేత అంటూ సీఎం కేసీఆర్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరుగుతున్నది. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి వీధుల్లో ఓ అభిమాని కేసీఆర్ బర్త్‌డే రోజు ఫ్లెక్సీలు కట్టి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం… కేసీఆర్ ముంబై పర్యటనకు ఒకరోజు ముందే ఫ్లెక్సీలతో స్వాగతం పలికాడు మరో అభిమాని. కేసీఆర్ అభిమాని సాయి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అందరినీ ఆకట్టుకొంటున్నాయి. దేశ్‌కీ నేత కేసీఆర్ అనే ఫ్లెక్సీలు ఆలోచింపజేస్తున్నాయి.
‘దేశానికి భవిష్యత్తు నేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ భారీ ఎల్ఈడీ ఫ్లెక్సీ.. దేశ్‌కీ నేత కేసీఆర్‌కు మహారాష్ట్ర సాదర స్వాగతం పలుకుతున్నది.. దేశానికి కేసీఆర్ అవసరం..’ అంటూ ఏర్పాటుచేసిన హోర్డింగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆ ఫ్లెక్సీల ఏర్పాటుతో కేసీఆర్ గురించి చర్చ జోరుగా సాగుతున్నది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో కేసీఆర్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. దేశానికి కేసీఆర్ వంటి రాజనీతిజ్ఞుడు అవసరమనే నినాదం ఊపందుకొంటున్నది. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశమంతా కావాలి అనే ఆలోచన అందరిలోనూ కనిపిస్తున్నది.