హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ)/ఇబ్రహీంపట్నం: ఆసియా ఖండంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌ను రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కొహెడలో నిర్మించనున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. 178 ఎకరాల్లో నిర్మించనున్న ఈ మార్కెట్‌కు త్వరలోనే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. నెలాఖరులోగా డీపీఆర్ పూర్తవుతుందని వెల్లడించారు. మార్కెట్ కోసం రూ.50 లక్షలతో నిర్మించనున్న వంద ఫీట్ల రోడ్డుకు శుక్రవారం మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి నిరంజన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గడ్డిఅన్నారం మార్కెట్ ప్రస్తుత అవసరాలకు సౌకర్యంగా లేదని, కోహెడలో విశాలంగా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త మార్కెట్‌ను నిర్మిస్తున్నట్టు తెలిపారు. మార్కెట్లో విద్యుత్, తాగునీరు, రోడ్లు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, కోల్డ్‌స్టోరేజ్‌లు, విశ్రాంతి భవనాలు, బ్యాంకు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. వ్యాపారులు, కొనుగోలుదారులు అపోహలకు గురికావద్దని సూచించారు.
ఈ ప్రాంతం విమానాశ్రయానికి, ఔటర్ రింగ్‌రోడ్డుకు, ఆర్ఆర్ఆర్కు సమీపంలో ఉండడం కలిసొచ్చే అంశమని పేర్కొన్నారు. కోహెడ్ మార్కెట్లో కోల్డ్ స్టోరేజీని కూడా ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో ఉద్యాన పంటల సాగుకు ఎంతో అవకాశం ఉన్నదని చెప్పారు. ఇందులో భాగంగా 50 వేల ఎకరాల్లో ఆలుగడ్డ సాగుకు చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. అవసరమైన విత్తనం, నిల్వ కోసం కోల్డ్ స్టోరేజీని నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బేతి సుభాష్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు.