ఆదిలాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందిన ఓ కుటుంబం తమ బిడ్డకు కేసీఆర్ పేరు పెట్టి కృతజ్ఞతను చాటుకున్నది. వివరాలు ఇలా.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)కు చెందిన వాగ్మారే చంద్రకాంత్ – భాగ్యశ్రీ దంపతులు కూలీ పని చేసుకొంటూ ఉపాధి పొందేవారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత అభివృద్ధి శాఖ ద్వారా భాగ్యశ్రీ పేరిట రూ.18 లక్షలు విలువ చేసే మూడెకరాల భూమిని ఉచితంగా అందజేసింది. దీంతో వారు మూడేండ్లుగా వ్యవసాయం చేస్తూ రెండు పంటలు పండించుకొంటున్నారు. ఇటీవల చంద్రకాంత్, భాగ్యశ్రీ దంపతులకు కుమారుడు జన్మించాడు. గురువారం సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తమబిడ్డ నామకరణోత్సవాన్ని నిర్వహించిన వారు.. బాబుకు కేసీఆర్ పేరు పెట్టారు. ఈ వేడుకకు సర్పంచ్ మీనాక్షీ గాడ్గే, ఎంపీటీసీ సుభాష్ గాడ్గే హాజరయ్యారు.