Karuppu | తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం కరుప్పు విడుదలకు ముందే అనూహ్య ఇబ్బందుల్లో చిక్కుకుంది. దర్శకుడు ఆర్జే బాలాజి తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. త్రిష కృష్ణన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం మే 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో షోలు రద్దు కావడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం నుంచే థియేటర్లలో షోలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ విడుదలకు ముందు ఆర్థికపరమైన చిక్కులు తలెత్తడంతో మార్నింగ్ షోలు నిలిచిపోయినట్లు సమాచారం. తమిళనాడులో ప్రత్యేక షోలకు అనుమతులు వచ్చినప్పటికీ, అవి కూడా రద్దు కావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ ప్రభుత్వం ఉదయం 9 గంటల స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత కూడా ఒక్క షో పడకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుక్‌మైషోలో ఉదయం ఆటలకు సంబంధించిన బుకింగ్స్ కనిపించకపోవడంతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు థియేటర్లలో మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయ్యాయి. మ్యాట్నీ షోల బుకింగ్స్ కూడా రద్దు చేసినట్లు సమాచారం. ఓవర్సీస్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. అమెరికాలో ప్రీమియర్ షోలు నిలిపివేయడంతో పాటు, వీకెండ్ బుకింగ్స్‌పై కూడా అనిశ్చితి నెలకొంది. దీంతో సినిమా రిలీజ్‌పై సందిగ్ధత కొనసాగుతోంది.
ఈ పరిణామాలపై నిర్మాత ఎస్ఆర్ ప్రభు సోషల్ మీడియాలో స్పందించారు. “అనివార్య కారణాల వల్ల ఉదయం 9 గంటల ప్రదర్శనలు రద్దు చేయబడ్డాయి. అందరికీ మా హృదయపూర్వక క్షమాపణలు” అంటూ ట్వీట్ చేశారు. అయితే తదుపరి షోలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి నిర్మాతల పాత బకాయిలే ప్రస్తుతం సమస్యలకు కారణమయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఫైనాన్సియర్లకు చెల్లించాల్సిన బకాయిలు సకాలంలో క్లియర్ కాకపోవడంతో విడుదల నిలిచిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని, సమస్యలు పరిష్కారమైతే తదుపరి షోలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, దర్శకుడు ఆర్జే బాలాజీ బుధవారం రాత్రి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. “ఈ సినిమాకు మొదటి నుంచి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. అయినప్పటికీ 32 నెలల ప్రయాణం తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యాం. ఈసారి కూడా అన్నీ సవ్యంగా జరుగుతాయని నమ్ముతున్నాను” అని పేర్కొన్నారు.