తిరుపతి : టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామి ( Kalyana Venkateshwara Swamy ) ఆలయంలో నవంబరు 16న కార్తిక వనభోజన ( Kartika Vanabhojanam ) నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ కారణంగా నిత్య కల్యాణోత్సవం ఆర్జిత సేవ రద్దు చేసినట్లు వివరించారు.
ఇందులో భాగంగా ఉదయం 7 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి 9 గంటలకు శ్రీవారి మెట్టు వద్ద పార్వేట మండపానికి వేంచేపు చేస్తారని పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో ఉత్సవ మూర్తులకు అభిషేకం ఉంటుందని అన్నారు. అనంతరం అలంకారం, వనభోజనం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు.